Peddapalli: పెద్దపల్లిలో ఘనంగా భవన నిర్మాణ కార్మికుల 4వ జిల్లా మహాసభలు!
Peddapalli: పెద్దపల్లిలో శుక్రవారం భవన నిర్మాణ కార్మికుల 4వ మహాసభలు జరిగాయి. కార్మికుల సంక్షేమ నిధుల్లో రూ.150 కోట్ల అవినీతిపై విచారణ జరపాలని కామల్ల ఐలన్న డిమాండ్ చేశారు.
Peddapalli: పెద్దపల్లిలో ఘనంగా భవన నిర్మాణ కార్మికుల 4వ జిల్లా మహాసభలు!
పెద్దపల్లి జిల్లా: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల 4వ మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ కార్మికుల వ్యవస్థాపక అధ్యక్షులు కామల్ల ఐలన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నూతన పెద్దపల్లి జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. నూతనంగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ మహాసభలకు జిల్లా వ్యాప్తంగా భారీ సంఖ్యలో భవన నిర్మాణ కార్మికులు హాజరయ్యారు.
అనంతరం మహాసభను ఉద్దేశించి మాట్లాడిన వ్యవస్థాపక అధ్యక్షుడు కామల్ల ఐలన్న రాష్ట్ర ప్రభుత్వంపై, కార్మిక శాఖ మంత్రిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కార్మికుల సంక్షేమ నిధుల్లో సుమారు రూ.150 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరిపించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి అల్లుడికి ఏజెన్సీకి సంబంధించిన కాంట్రాక్టులన్నీ అప్పగించి, కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తూ వారి సొమ్మును దోచుకుంటున్నారని ఐలన్న ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసి, బతికున్న కార్మికులను సైతం చనిపోయినట్లు రికార్డుల్లో చూపిస్తూ సంక్షేమ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
కార్మికుల కష్టార్జితాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే వారి పొట్ట కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమ నిధుల వినియోగంపై పారదర్శకత తీసుకురావాలని, అవినీతి ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ మహాసభల్లో నూతన జిల్లా కమిటీ సభ్యులతో పాటు పలువురు కార్మిక సంఘాల నాయకులు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.




