Sircilla: సిరిసిల్లలో ఒకే ఆర్టీసీ బస్సులో 109 మంది విద్యార్థులు!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒకే ఆర్టీసీ బస్సులో 109 మంది కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు ప్రయాణిస్తుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

KALEEM, SIRICILLA
Published on: 24 Sept 2026 12:43 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో ఒకే ఆర్టీసీ బస్సులో 109 మంది విద్యార్థులు!

Sircilla: కేంద్రీయ విద్యాలయ విద్యార్థుల రవాణా విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఆర్టీసీ బస్సులో 109 మంది విద్యార్థులు ప్రయాణించాల్సి వస్తోందని, దీంతో బస్సులో తీవ్ర రద్దీ ఏర్పడుతోందని వారు తెలిపారు.

చిన్నారులు పుస్తకాలతో కూడిన భారీ బ్యాగులతో కిక్కిరిసిన బస్సులో ప్రయాణించాల్సి వస్తుండటంతో వారి భద్రత, ఆరోగ్యం, సౌకర్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే బస్సు నుంచి 109 మంది విద్యార్థులు దిగుతున్న దృశ్యాలను వీడియోగా చిత్రీకరించి అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు.

ఈ సమస్యను ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని తల్లిదండ్రులు తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని, ఒకే బస్సులో అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రయాణించే పరిస్థితిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

సమస్యపై విచారణ జరిపి బాధ్యత వహించాల్సిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. జిల్లా కలెక్టర్‌ వెంటనే చొరవ తీసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచుల JAC రాష్ట్ర అధ్యక్షుడు అక్కెనపెల్లి కరుణాకర్‌ విద్యార్థుల రవాణా సమస్యపై తక్షణమే అధికారులు స్పందించాలని కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA