Yellareddypet: ఎకరం 20 గుంటల్లో పది రకాల పంటలు.. నెలకు రూ.50 వేల ఆదాయం

Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో ఎకరం 20 గుంటల్లో 10 రకాల పంటలు సాగు చేస్తూ నెలకు రూ.50 వేలు ఆర్జిస్తున్న రైతును కలెక్టర్ అభినందించారు.

KALEEM, SIRICILLA
Published on: 10 Nov 2026 6:11 PM IST
Yellareddypet
X

Yellareddypet: ఎకరం 20 గుంటల్లో పది రకాల పంటలు.. నెలకు రూ.50 వేల ఆదాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు గుర్రాల సత్యారెడ్డి విభిన్న పంటల సాగుతో ఆదర్శంగా నిలుస్తున్నారు. కేవలం ఎకరం 20 గుంటల విస్తీర్ణంలో పది రకాలకు పైగా ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తూ ప్రతి నెలా సుమారు రూ.50 వేల ఆదాయం పొందుతున్నారు.

సత్యారెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో తోటకూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు, వంకాయలు, సొరకాయ, పచ్చిమిర్చి, బీట్‌రూట్, కంది తదితర పంటలను సాగు చేస్తున్నారు. వివిధ రకాల పంటలు సాగు చేయడంతో వారానికోసారి ఉత్పత్తులు చేతికి వస్తున్నాయని, తద్వారా నిరంతర ఆదాయం పొందుతున్నట్లు రైతు తెలిపారు. కోతులు, ఇతర జంతువుల నుంచి పంటలను రక్షించుకునేందుకు సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు.

వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించిన కలెక్టర్

గొల్లపల్లి గ్రామంలోని గుర్రాల సత్యారెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగు చేస్తున్న ఆకుకూరలు, కూరగాయల రకాలు, యాజమాన్య పద్ధతులు, ఉత్పత్తి, విక్రయాలు, ఆదాయ వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు.

వరి సాగుకు ప్రత్యామ్నాయంగా కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్న సత్యారెడ్డిని కలెక్టర్ అభినందించారు. ఇతర రైతులు కూడా ఇలాంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించి ఆదాయం పెంచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ దివ్య, ఎంపీడీఓ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA