Kakinada: జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో నిలిచిన రాకపోకలు!
Kakinada: కాకినాడ జిల్లా జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో తుఫాను గాలుల బీభత్సం. నేలకొరిగిన భారీ మర్రిచెట్టు, ధ్వంసమైన విద్యుత్ స్తంభాలు. అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం.
Kakinada: జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో నిలిచిన రాకపోకలు!
Kakinada: తుపాను గాలులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. జగ్గంపేట మండలం కొత్తూరు గ్రామంలోని కాలనీ సమీపంలో రహదారి పక్కన ఉన్న భారీ మర్రిచెట్టు రాత్రి వీచిన తుపాను గాలులకు నేలకొరిగింది.
ఈ ఘటనలో చెట్టు విద్యుత్ స్తంభాలపై పడటంతో అవి పూర్తిగా దెబ్బతిన్నాయి. విద్యుత్ తీగలు ధ్వంసమవడంతో పాటు రహదారిపై చెట్టు అడ్డంగా పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
ఈ మర్రిచెట్టు ప్రమాదకర స్థితిలో ఉందని, ఎప్పుడైనా రహదారిపై కూలిపోయే అవకాశం ఉందని గతంలో పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తుగా స్పందించి చెట్టును తొలగించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని అంటున్నారు. భగవంతుని దయవల్ల ప్రాణనష్టం జరగలేదని, అయితే విద్యుత్ స్తంభాలు, తీగలు ధ్వంసమవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొంటున్నారు.
నాయకంపల్లి–ఎల్లమిల్లి మార్గంలో మరో చెట్టు కూలి..
మరోవైపు గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామం నుంచి ఎల్లమిల్లి వెళ్లే రహదారిపై కూడా తుపాను గాలులకు చెట్టు కూలి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాకపోకలకు ఆటంకం ఏర్పడటంతో సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారిపై పడిన చెట్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
ముందస్తు చర్యలు తీసుకోవాల్సిందే!
రహదారుల పక్కన ప్రమాదకరంగా ఉన్న చెట్లు, విద్యుత్ స్తంభాలు, తీగల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ప్రజలు ముందుగానే ఫిర్యాదు చేసినప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు రహదారులపై అడ్డంగా పడిన చెట్లను తొలగించి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.




