Pithapuram: అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ పోటీకి సిద్ధం
Pithapuram: పిఠాపురంలో వైఎస్సార్సీపీ సన్నాహక సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ స్థానిక ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని వంగా గీత పిలుపునిచ్చారు.
Pithapuram: అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ పోటీకి సిద్ధం
పిఠాపురం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పోటీకి సిద్ధంగా ఉండాలని పిఠాపురం నియోజవర్గ వైఎస్ఆర్ సి పి ఇన్చార్జి వంగా గీత విశ్వనాథ్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్త సమావేశం స్థానిక రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో పార్టీ పిఠాపురం మండల అధ్యక్షుడు అడపా రఘు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వంగా గీత విశ్వనాథ్ మాట్లాడుతూ కూటమి నాయకులు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి అధికారం చేపట్టాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పింఛన్, మహిళలకు 15000, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పన, ఉద్యోగులకు వివిధ రకాల హామీలు అంటే అనేక రకాల హామీలను ఇచ్చారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు కూటం ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఏ ఎన్నికలు జరిగినా వైయస్సార్సీపి విజయం ఖాయమన్నారు.
ఇచ్చిన హామీలు ఇచ్చినట్టుగా నెరవేర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని, పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు విజయం సాధించడం కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విజయం సాధించడం లోనే అసలైన విజయం ఉందన్నారు.
ఈ సమావేశంలో ఇటీవల పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీటీసీలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మండల వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




