Peddapuram: పెద్దాపురంలో స్ట్రాంగ్ రూమ్‌ల తనిఖీ: కలెక్టర్

Peddapuram: పెద్దాపురం మహారాణి డిగ్రీ కళాశాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

JAGADEESWARARAO, PEDDAPURAM
Published on: 19 Oct 2026 5:34 PM IST
Peddapuram
X

Peddapuram: పెద్దాపురంలో స్ట్రాంగ్ రూమ్‌ల తనిఖీ: కలెక్టర్

కాకినాడ జిల్లా: పెద్దాపురం మహారాణి డిగ్రీ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్‌లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

జిల్లాలో జరగనున్న ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలు-2026 నిర్వహణకు సంబంధించి పెద్దాపురం డివిజన్ పరిధిలోని పెద్దాపురం మహారాణి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్‌లు,ఓట్ల లెక్కింపు కేంద్రాలను సోమవారం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ రెవెన్యూ, జిల్లా పరిషత్, పోలీస్ తదితర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కళాశాల ప్రాంగణాన్ని క్షుణ్ణం గా తనిఖీ చేసి,ఎన్నికల ప్రక్రియను అత్యంత పకడ్బందీగా, సురక్షితంగా, సజావుగానిర్వహించేందుకు ఏర్పాటు చేయనున్న రిసెప్షన్ కేంద్రం,స్ట్రాంగ్ రూమ్‌లు,ఓట్ల లెక్కింపు కేంద్రాల స్థలాలను పరిశీలించారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కల్పించాల్సిన కనీస మౌలిక సదుపాయాలు,భద్రతా ప్రమాణాలు,ప్రవేశ మార్గాలు,బ్యారీ కేడింగ్ తదితర ఏర్పాట్ల పై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ....

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లకు తావులేకుండా, పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

రిసెప్షన్ కౌంటర్ల వద్ద ఎన్నికల సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రక్రియలో జాప్యం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.స్ట్రాంగ్ రూమ్‌ ల వద్ద సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయడంతో పాటు,24 గంటల పోలీసు బందోబస్తు కల్పించాలని ఆదేశించారు. అవసరమైన సాంకేతిక సదుపాయాలను సమకూర్చి,రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను పటిష్టంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్పష్టం చేశారు.

ఈ పరిశీలనలో పెద్దాపురం ఆర్డీవో పి. కృష్ణమూర్తి, జిల్లా పరిషత్ సీఈవో వి.వి.వి.ఎస్.లక్ష్మణరావు, సీఐ వై ఆర్ కె శ్రీనివాస్ డీఎస్పీ తిలక్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు

JAGADEESWARARAO, PEDDAPURAM

JAGADEESWARARAO, PEDDAPURAM