Pithapuram: పిఠాపురంలో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు!

Pithapuram: పిఠాపురం పట్టణంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.టి.వి. రాజేశ్వరరావు ఆకస్మిక తనిఖీలు. పారిశుద్ధ్యం, తాగునీరు, అభివృద్ధి పనులపై పరిశీలన.

RAMA KRISHNA, KKD
Published on: 8 Oct 2026 11:36 AM IST
Pithapuram
X

Pithapuram: పిఠాపురంలో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు!

Pithapuram: పిఠాపురం పురపాలక సంఘం పరిధిలో ప్రజలకు అందుతున్న మౌలిక వసతులు, పారిశుద్ధ్య నిర్వహణ మరియు అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎస్.టి.వి. రాజేశ్వరరావు గురువారం 11వ సచివాలయం పరిధిలోని జగ్గయ్య చెరువు ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తూ పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల పనితీరు తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలను నేరుగా కలిసి, తాగునీటి సరఫరా సక్రమంగా జరుగుతున్నదా, పారిశుద్ధ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా, వీధి దీపాలు పనిచేస్తున్నాయా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారులు, సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అదేవిధంగా 11వ సచివాలయం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు, రహదారుల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణ పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ పనుల్లో ఉపయోగిస్తున్న మెటీరియల్ నాణ్యత, పనుల ప్రగతి, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయా అనే అంశాలను పరిశీలించారు. ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగే విధంగా నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని, డ్రైనేజీలను శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే తాగునీటి సరఫరా, వీధి దీపాల సమస్యలపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.

ఈ ఆకస్మిక తనిఖీలలో పట్టణ జనసేన నాయకులు, జనసేన సైనికులు బాలిపల్లి రాంబాబు, చంద్రశేఖర్ మరియు ఇతర జనసేన నాయకులు పాల్గొని, స్థానిక సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.టి.వి. రాజేశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్, టాప్ ఇన్‌స్పెక్టర్ జనార్ధన్, 11వ సచివాలయ సిబ్బంది మరియు ఇతర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD