Gandepalli: మురారి–రామయ్యపాలెం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన!
Gandepalli: కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో రూ.4.49 కోట్లతో చేపట్టనున్న మురారి–రామయ్యపాలెం తారు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శంకుస్థాపన చేశారు.
Gandepalli: మురారి–రామయ్యపాలెం రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన!
Gandepalli: కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో పల్లె పండుగ 3.0 అభివృద్ధి జాతరలో భాగంగా మురారి నుంచి దుర్గమ్మ పాదాల మీదుగా రామయ్యపాలెం వరకు 5.279 కిలోమీటర్ల మేర తారు రోడ్డు నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సాస్ నిధుల నుంచి రూ.4 కోట్ల 49 లక్షల అంచనా వ్యయంతో ఈ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఈ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి జాస్తి వసంత్ ఆధ్వర్యంలో నాయకులు మంగళవాయిద్యాలతో ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గ్రామీణ రహదారుల అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రహదారులు నిర్లక్ష్యానికి గురయ్యాయని పేర్కొన్నారు. మురారి నుంచి దుర్గమ్మ పాదాల మీదుగా రామయ్యపాలెం వెళ్లే రహదారి ఎన్నో ఏళ్లుగా అధ్వానంగా ఉండటంతో భక్తులు, రైతులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.
ఈ సమస్యను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగానే స్పందించి రూ.449 లక్షలు మంజూరు చేశారని వివరించారు. రహదారి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు, దుర్గమ్మ ఆలయానికి వెళ్లే భక్తులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో రహదారుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇప్పటికే చిల్లంగి నుంచి పెద్దనాపల్లి మీదుగా వేలంక వరకు రహదారి పనులకు శంకుస్థాపన చేశామని, శుక్రవారం ఇర్రిపాక నుంచి కాండ్రేగుల వరకు రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్యదొర, రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు, పుష్కర ప్రాజెక్టు కమిటీ చైర్మన్ అడబాల భాస్కరరావు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు కందుల చిట్టిబాబు, మాజీ వైస్ ఎంపీపీ కుంచె రాజా, పంచాయతీరాజ్ ప్రాజెక్టుల డీఈ గంగాధరం, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త కొండబాబు, యర్రంశెట్టి బాబ్జి, బొల్లంరెడ్డి రామకృష్ణ, అడబాల రామాంజనేయులు, బొండా శ్రీనుబాబు, చావా నరసింహమూర్తి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సుంకవిల్లి రాజు, ఉండవల్లి బుల్లియ్య, గద్దె అబన్న, కూటమి నాయకులు, అధికారులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




