Jaggampeta: జగ్గంపేటలో ఘనంగా కూటమి విస్తృత స్థాయి ఆత్మీయ సమ్మేళనం!
Jaggampeta: కాకినాడ జిల్లా జగ్గంపేటలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. 30 వేల అభివృద్ధి పుస్తకాలతో ప్రజల్లోకి వెళ్లనున్నట్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు.
Jaggampeta: జగ్గంపేటలో ఘనంగా కూటమి విస్తృత స్థాయి ఆత్మీయ సమ్మేళనం!
Jaggampeta: స్థానిక సంస్థల సమరానికి జగ్గంపేట కూటమి శ్రేణులు స్థానిక సమరానికి సిద్ధమయ్యాయి. రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ విస్తృతస్థాయి ఆత్మీయ సమ్మేళనం హోరెత్తింది. జగ్గంపేట శాసనసభ్యులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన, కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ముఖ్యఅతిథిగా జరిగిన ఈ భేటీలో నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం ఉరకలెత్తింది.
కూటమి జెండా ఎగరాల్సిందే - త్యాగానికి సిద్ధం కావాలి:
ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, అదే ఊపుతో స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థులతో బరిలోకి దిగుతాయని, పార్టీ కోసం, కూటమి విజయం కోసం కొంతమంది టికెట్లు త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చి విజయఢంకా మోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
30 వేల పుస్తకాలతో ప్రజల్లోకి:
జగ్గంపేట నియోజకవర్గంలో గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రూపొందించిన ప్రత్యేక అభివృద్ధి పుస్తకాలతో ఈ నెల 30 వ తేదీ నుంచి కార్యకర్తలు ప్రచారానికి సిద్ధమయ్యారు. ఇందుకోసం ఏకంగా 30 వేల పుస్తకాలను ముద్రించామని, ప్రతి క్లస్టర్ ఇంచార్జి గ్రామాల ముఖ్య నాయకులతో కలిసి ప్రభుత్వం చేసిన మేలును వివరించాలని ఆదేశించారు.
ప్రతి మండలానికి ప్రత్యేక కమిటీ:
పార్టీని మరింత బలోపేతం చేసేందుకు, సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ప్రతి మండలానికి నలుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీలు వేస్తున్నట్లు వెల్లడించారు. జగ్గంపేటకు అడపా భరత్, కిర్లంపూడికి కందుల చిట్టిబాబు, గోకవరానికి ఎస్వీఎస్ అప్పలరాజు, గండేపల్లికి మారిశెట్టి భద్రం నాయకత్వం వహించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రథం మరింత వేగంగా ముందుకు సాగాలంటే స్థానిక సంస్థల్లో కూటమి జెండా ఎగరాల్సిందేనని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేసి కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ, ఆత్మ కమిటీ, ఆలయ అభివృద్ధి కమిటీచైర్మన్లు, 4 మండలాల టిడిపి అధ్యక్షులు, 12 మంది క్లస్టర్ ఇంచార్జిలు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, వివిధ ప్రాజెక్టుల చైర్మన్లు, సొసైటీ అధ్యక్షులు, మాజీఎంపీపీలు, జడ్పిటిసిలు, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, మండల స్థాయి, గ్రామస్థాయి టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




