Lova: లోవ క్షేత్రంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం
Lova: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లోవ శ్రీ తలంపులమ్మ దేవస్థానంలో శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. తొలిరోజు బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమిచ్చారు.
Lova: లోవ క్షేత్రంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం
లోవ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన లోవలో వెలసిన శ్రీ తలంపులమ్మ దేవి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు 'బాల త్రిపుర సుందరి' (బాలాంబిక) ప్రత్యేక అలంకరణలో భక్తులకు అభయమిచ్చారు. కొండల మధ్య రమణీయమైన లోయలో కొలువైన అమ్మవారి మూలవిరాట్‌ను దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు.
బాలా త్రిపుర సుందరి దేవి అసురుడైన భండాసురుడి కుమారులను సంహరించిన దేవతా స్వరూపంగా, లోక కల్యాణం కోసం బాలిక రూపంలో అవతరించిన మహాశక్తిగా భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
ప్రత్యేక పూజలు మరియు వేద పండితుల ప్రవచనం:
ఆలయ కార్యనిర్వణాధికారి (ఇఓ) విశ్వనాథరాజు మరియు ధర్మకర్తల మండలి అధ్యక్షులు పెంటకోట భాస్కర సత్యనారాయణ పర్యవేక్షణలో తొలిరోజు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పండితులు శరన్నవరాత్రి తొలిరోజు అమ్మవారి అలంకార విశేషాలను భక్తులకు వివరించారు:
* జాగృతి, స్వప్న, సుషుక్తి స్థితులు: మనిషి శరీరంలోని ఈ మూడు జాగృత స్థితులను తన ఆధీనంలో ఉంచుకునే అధిదేవతగా బాలా త్రిపుర సుందరిని ఆరాధిస్తారు.
* ప్రాణశక్తి ప్రదాత: ప్రతి మనిషి బాల్యంతో మొదలైనట్లే, అమ్మవారు తన బాల్య రూపం నుంచే ఈ జగత్తును పాలిస్తూ, భక్తులను కాపాడుతూ, దుష్టులను శిక్షిస్తారని విశ్వాసం. ప్రాణశక్తిని, మూలాధార శక్తిని ఆరాధించడమే బాలా త్రిపుర సుందరి పూజ.
* శ్రీవిద్యోపాసనకు తొలిమెట్టు: బాల రూపం అనగా కల్మషం లేని తనం మరియు అమాయకత్వం. భగవంతుడిని స్వచ్ఛమైన మనసుతో కొలిస్తే సులభంగా అనుగ్రహం లభిస్తుంది. శ్రీవిద్యోపాసన (శ్రీచక్ర పూజ) అభ్యసించే సాధకులకు మొదటగా 'బాల మంత్రం' తోనే దీక్ష లేదా ఉపదేశం ఇస్తారని, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ప్రథమ సోపానమని పండితులు తెలిపారు.
రేపటి విశేషం:
శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా రెండవ రోజైన రేపు అమ్మవారు 'గాయత్రి దేవి' అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
అధికారుల విజ్ఞప్తి:
ఈ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజూ ఉదయం భక్తులచే నిర్వహించే సామూహిక కుంకుమార్చనకు కావలసిన పూజా ద్రవ్యాలను దేవస్థానం వారే సమకూర్చుతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులందరూ ఈ పవిత్ర ఉత్సవాల్లో పాల్గొని, రోజువారీ అవతారాల్లో కొలువైన అమ్మవారిని దర్శించి పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించి తరింపవలసిందిగా కార్యనిర్వణాధికారి కోరారు.
అమ్మవారి సేవలో...




