Surampalem: సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో ‘ఆపరేషన్ త్రిశూల్’ అవగాహన సదస్సు!
Surampalem: కాకినాడ జిల్లా సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో 'ఆపరేషన్ త్రిశూల్' అవగాహన కార్యక్రమం. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Surampalem: సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో ‘ఆపరేషన్ త్రిశూల్’ అవగాహన సదస్సు!
Surampalem: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్, ఐపీఎస్ సూచించారు. సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్సిటీలో నిర్వహించిన ‘ఆపరేషన్ త్రిశూల్’ అవగాహన కార్యక్రమంలో ఆయన స్వయంగా పాల్గొని విద్యార్థులకు పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి, ఇతర మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం చేపట్టిన ‘రైజ్ ఎగైనెస్ట్ గాంజా’ కార్యక్రమంలో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం అందించే వారికి తగిన బహుమతి ఇస్తామని, అలాంటి సమాచారాన్ని 1972 హెల్ప్‌లైన్ నంబర్‌కు తెలియజేయాలని సూచించారు.
రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత
రహదారి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ స్పష్టం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, కార్లలో ప్రయాణించేవారు సీటుబెల్టు ధరించాలని సూచించారు. అతివేగం, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ వినియోగించడం వంటి నిర్లక్ష్యపు చర్యలకు దూరంగా ఉండాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టపరంగా తీవ్రమైన నేరమని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ప్రజల ప్రాణాల రక్షణ కోసమేనని వివరించారు.
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. అపరిచిత లింకులు, ఆన్‌లైన్ పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో వచ్చే ప్రలోభాలు, నకిలీ పెట్టుబడి పథకాలను నమ్మవద్దన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, పిన్, ఓటీపీ వంటి రహస్య సమాచారాన్ని ఇతరులకు వెల్లడించకూడదని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచించారు. అనధికారిక రుణ యాప్‌ల ఉచ్చులో చిక్కుకోవద్దని హెచ్చరించారు.
మహిళల భద్రతకు ప్రాధాన్యం
మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఎస్పీ తెలిపారు. వేధింపులకు గురైన వారు భయపడకుండా 112 అత్యవసర నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ‘ఆపరేషన్ సేఫ్ క్యాంపస్’లో భాగంగా విద్యార్థులు నేరాల నివారణలో పోలీసులకు సహకరిస్తూ సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. సీనియర్ విద్యార్థులు జూనియర్ల పట్ల స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, వారితో సరదాగా మాట్లాడటం, కలిసి క్యాంటీన్‌లో కాఫీ తాగడం వంటి చర్యల ద్వారా వారిలో భయాన్ని తొలగించి, ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామనే నమ్మకాన్ని కల్పించాలని సూచించారు.
పోలీసు, విశ్వవిద్యాలయ అధికారులు హాజరు
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, ఎస్‌బీ డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ, పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్, ఈగల్ ఇన్‌స్పెక్టర్ జి. వెంకటేశ్వరరావు, జగ్గంపేట సీఐ తిరుపతిరావు, గండేపల్లి ఎస్సై యు.వి. శివనాగబాబు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఆదిత్య యూనివర్సిటీ తరఫున ప్రో ఛాన్సలర్ డాక్టర్ ఎన్. సతీష్ రెడ్డి, డిప్యూటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ ఎం. శ్రీనివాస రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ జి. సురేష్, డీన్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ వై.కె.ఎస్. సుబ్బారావు, యాంటీ ర్యాగింగ్ కన్వీనర్ డాక్టర్ ఐ. రమేష్ రాజా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.




