Kakinada: కిర్లంపూడిలో ఉత్కంఠ: మాజీ మంత్రి అంబటి రాంబాబు విచారణ!

Kakinada: కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు గంటన్నర పాటు విచారించారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 10 Nov 2026 7:54 PM IST
Kakinada
X

Kakinada: కిర్లంపూడిలో ఉత్కంఠ: మాజీ మంత్రి అంబటి రాంబాబు విచారణ!

కాకినాడ: కాకినాడ జిల్లా కిర్లంపూడిలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు పర్యటన తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి చేరుకున్న ఆయనకు ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి ముద్రగడ గిరిబాబు ఆత్మీయ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా స్వర్గీయ ముద్రగడ చిత్రపటానికి, ఆయన సమాధి వద్ద అంబటి రాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముద్రగడ గిరిబాబుతో కలిసి పలు రాజకీయ, సమకాలీన అంశాలపై చర్చించారు.

అంబటి రాంబాబు పర్యటన నేపథ్యంలో కిర్లంపూడి పోలీసులు ఆయనను స్థానిక పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి సుమారు గంటన్నర పాటు విచారించారు. ఈ విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి పూర్తిగా సహకరించినట్లు ఆయన వెల్లడించారు.

విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముద్రగడ అంత్యక్రియల సమయంలో గౌరవ వందనం వద్దని కుటుంబ సభ్యులు సూచించారని, వారి అభీష్టం మేరకే తాను జోక్యం చేసుకుని అడ్డుకున్నానని వివరించారు. అయితే ఆ ఘటనను సాకుగా చూపి తనపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు నమోదు చేస్తూ వేధింపులకు గురిచేస్తోందని విమర్శించారు. పగ సాధింపు రాజకీయాలతో ప్రతిపక్షాన్ని భయపెట్టి లొంగదీసుకోవచ్చని భావించడం పొరపాటేనని హెచ్చరించారు. మొత్తంగా అంబటి రాంబాబు కిర్లంపూడి పర్యటన, పోలీసుల విచారణతో జగ్గంపేట నియోజకవర్గ రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA