Kakinada: పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జేసీ అపూర్వ భరత్
Kakinada: కాకినాడ జిల్లా పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట పంపిణీ కేంద్రాల్లో జేసీ అపూర్వ భరత్ తనిఖీలు. బ్యాలెట్ బాక్సులు, సామగ్రి పంపిణీపై ఆరా.
Kakinada: పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జేసీ అపూర్వ భరత్
కాకినాడ: జిల్లాలో స్థానిక సంస్థల ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఓటింగ్ సామాగ్రి పంపిణీ ప్రక్రియను బుధవారం స్థానిక సంస్థల జిల్లా రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.
జిల్లాలోని ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పంపిణీ కేంద్రాల్లో జరుగుతున్న పోలింగ్ సిబ్బందికి అవసరమైన సామగ్రిని అందజేసే ప్రక్రియ, పంపిణీ కేంద్రాల పనితీరును, అక్కడి వసతులను జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ స్వయంగా సందర్శించి పరిశీలించారు.
ఈ పరిశీలనలో భాగంగా కాకినాడ గ్రామీణ మండలం ఏపీఎస్పీ 3వ బెటాలియన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పిఠాపురం శ్రీ బాదం మాధవరావు బాలికల ఉన్నత పాఠశాల, గండేపల్లి మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం, జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెద్దాపురం మహారాణి కళాశాల, కరప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని కేంద్రాలను జాయింట్ కలెక్టర్ నేరుగా పరిశీలించి అక్కడి భద్రతా ఏర్పాట్లను, సామాగ్రి అందజేత ప్రక్రియ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ.. జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పారదర్శకంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ఓటింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాల వద్ద సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
పోలింగ్ అధికారులకు అవసరమైన బ్యాలెట్ పెట్టెలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల బ్యాలెట్ పత్రాలు, వేలికి వేసే చెరిగిపోని సిరా, స్టాంపులు, సీలింగ్ మైనం, కవర్లు, నివేదిక పత్రాలు సమగ్ర ఓటర్ల జాబితాలతో కూడిన ప్రత్యేక సంచీలునుశసిబ్బంది తమకు కేటాయించిన సామగ్రిని జాబితా ప్రకారం సరి చూసుకుని తీసుకోవాలని జేసీ ఆదేశించారు.
సామాగ్రిని స్వీకరించిన ఓటింగ్ సిబ్బంది, భద్రతా బలగాలతో కలిసి కేటాయించిన ప్రత్యేక వాహనాల్లో సురక్షితంగా తమ ఓటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద నిరంతరం కెమెరాల నిఘాతో పాటు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అత్యంత అప్రమత్తతతో వ్యవహరించి ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పరిశీలనలో జేసీ వెంట ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




