Kakinada: రైతుల వద్ద ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
Kakinada: ధాన్యం క్వింటాలుకు రూ.2,441 మద్దతు ధర నిర్ణయించిన ప్రభుత్వం. జెడ్.రాగంపేటలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కాకినాడ జిల్లా జేసీ అపూర్వ భరత్.
Kakinada: రైతుల వద్ద ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
కాకినాడ: జిల్లాలో రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు.
బుధవారం గండేపల్లి మండలం జెడ్. రాగంపేట రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రైతులందరి నుంచి ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టిందన్నారు. ఈ ఏడాది ధాన్యానికి క్వింటాలుకు రూ.2,441 మద్దతు ధర నిర్ణయించినట్లు తెలిపారు.
తుఫాను ప్రభావం తగ్గి వాతావరణం అనుకూలించిన అనంతరం రైతులు పంట నూర్పిడి చేపట్టి, నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని సిద్ధం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
జిల్లా జాయింట్ డైరెక్టర్ వి.టి. రామారావు మాట్లాడుతూ, గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వాతావరణం అనుకూలించిన వెంటనే పంట కోతలు చేపట్టి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీఎం సివిల్ సప్లైస్ ఆనందరావు, డీఎస్ఓ ప్రసన్నలక్ష్మి, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.




