Kakinada: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు వినతిపత్రం అందజేసిన ఆశా వర్కర్లు

Kakinada: కాకినాడలో ఆశా వర్కర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 6 Oct 2026 5:15 PM IST
Kakinada
X

Kakinada: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు వినతిపత్రం అందజేసిన ఆశా వర్కర్లు

కాకినాడ: స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. 7 సంవత్సరాలుగా కనీస వేతనాలు పెంచకపోవడం, 20 సంవత్సరాలుగా ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు ఎలాంటి సెలవులు లేకపోవడంతో అనారోగ్యాల పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

అంగన్వాడీలకు అమలవుతున్న అన్ని రకాల సెలవులను ఆశా వర్కర్లకు అమలు చేయాలని, ప్రభుత్వం చెల్లించే 10 వేల నెల జీతంలో పిహెచ్సీలకు వెళ్లడానికి 3,4 వేలు ఖర్చవుతోందని, సంబంధం లేని పనులు చేయిస్తూ అధిక జనాభాతో పనిచేయించడం వలన తీవ్ర పనిఒత్తిడికి గురవుతున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు.

కనీస వేతనాలు చెల్లించి ఆశా వర్కర్లను పర్మినెంట్ చేయాలని, అన్ని రకాల సెలవులు, దహన సంస్కారాల ఖర్చులు, 10 లక్షల ఇన్సూరెన్స్, నాణ్యమైన మొబైల్స్, యూనిఫామ్ ఇవ్వాలని, నియామకాలు ప్రభుత్వమే చేపట్టి ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలని, ఏఎన్ఎం, జిఎన్ఎం శిక్షణ పొందిన ఆశాలకు పర్మినెంట్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA