Jaggampeta: జగ్గంపేటలో 500 మందితో మెగా రక్తదానం: పాటంశెట్టి
Jaggampeta: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 21న జగ్గంపేటలో 500 మందితో మెగా రక్తదాన శిబిరం, 1,000 మందితో బ్లడ్ డోనర్స్ గ్రూప్ ఏర్పాటు.
Jaggampeta: జగ్గంపేటలో 500 మందితో మెగా రక్తదానం: పాటంశెట్టి
కాకినాడ జిల్లా, జగ్గంపేట: దేశ రక్షణ కోసం,ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తూ అమరులైన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారికి ఘనమైన నివాళిగా అక్టోబర్ 21వ తేదీన జగ్గంపేటలో 500 మందితో మెగా రక్తదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కేవలం నివాళులు అర్పించడంతోనే ఆగిపోకుండా, వారి త్యాగస్ఫూర్తితో ప్రజల ప్రాణాలను కాపాడే సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో ఈ మెగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
అత్యవసర సమయంలో రక్తం అందక ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదనే లక్ష్యంతో జగ్గంపేట నియోజకవర్గంలో 1,000 మంది రక్తదాతలతో ప్రత్యేక బ్లడ్ డోనర్స్ గ్రూప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సూర్యచంద్ర వెల్లడించారు.
ఈ రక్తదాతల గ్రూప్‌కు ప్రజల భాగస్వామ్యంతో ఒక ప్రత్యేకమైన, స్ఫూర్తిదాయకమైన పేరును ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు, యువత, రక్తదాతలు తమకు నచ్చిన మంచి పేర్లను సూచించాలని, అందులో అత్యుత్తమమైన పేరును ఎంపిక చేసి గ్రూప్‌కు నామకరణం చేయనున్నట్లు చెప్పారు. “ఈ గ్రూప్ పేరు కేవలం ఒక పేరు కాకుండా... జగ్గంపేటలో రక్తదానం, ప్రాణదానం, సేవాభావానికి ప్రతీకగా నిలవాలని. అందుకే ప్రజల నుంచే మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం” అని సూర్యచంద్ర పేర్కొన్నారు.
రక్తదాతల వివరాలను రక్తగ్రూపుల వారీగా నమోదు చేసి, అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి సకాలంలో రక్తం అందేలా ఈ గ్రూప్‌ను నిరంతరం సేవలందించే విధంగా రూపొందించనున్నట్లు తెలిపారు.
“రక్తదానం ఒక దానం కాదు... ఒక ప్రాణానికి పునర్జన్మ.” “అమరవీరుల త్యాగానికి రక్తదానమే ఘన నివాళి.”
“పోలీస్ అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేసి ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచారని వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని మనం రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడగలిగితే, అదే వారికి మనం అందించే నిజమైన నివాళి” అని సూర్యచంద్ర అన్నారు.
జగ్గంపేట నియోజకవర్గంలోని యువత, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చి అక్టోబర్ 21న జరిగే 500 మంది మెగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొనాలని, అలాగే భవిష్యత్తులో అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందించేందుకు 1,000 మంది రక్తదాతల బృందంలో సభ్యులుగా చేరాలని పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు.




