Gandepalli: జె.రాగంపేటలో బాణసంచా దుకాణాలపై అధికారుల ఆకస్మిక తనిఖీలు
Gandepalli: జె. రాగంపేటలో బాణసంచా దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు. భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై శివ నాగబాబు హెచ్చరిక.
Gandepalli: జె.రాగంపేటలో బాణసంచా దుకాణాలపై అధికారుల ఆకస్మిక తనిఖీలు
గండేపల్లి: దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా విక్రయ కేంద్రాల వద్ద ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గండేపల్లి మండలం జెడ్, రాగంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను గండేపల్లి ఎస్సై శివ నాగబాబు , రెవెన్యూ ఇన్స్పెక్టర్, అగ్నిమాపక శాఖ సిబ్బంది సంయుక్తంగా తనిఖీ చేశారు. దుకాణాల ఏర్పాట్లు, భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనల అమలును క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు వ్యాపారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ అనుమతి పొందిన ప్రదేశాల్లోనే బాణసంచా దుకాణాలు నిర్వహించాలని, ప్రతి దుకాణంలో తప్పనిసరిగా లైసెన్స్, అనుమతి పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని స్పష్టం చేశారు. అగ్నిప్రమాదాలు సంభవించకుండా ప్రతి దుకాణం వద్ద నీటి బకెట్లు, ఇసుక బకెట్లు, అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు.
దుకాణాల మధ్య తగినంత దూరం పాటించాలని, విద్యుత్ తీగల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాణసంచా దుకాణాల పరిసరాల్లో ధూమపానం, నిప్పు వెలిగించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. అనుమతించిన పరిమితికి మించి బాణసంచా నిల్వ చేయకూడదని హెచ్చరించారు.
నిబంధనలు బేఖాతరు చేస్తే చర్యలు తప్పవు!
ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని, భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
దీపావళి వేడుకలు ప్రమాదాలకు తావులేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాపారులు నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు. పండుగ సంబరాల కంటే ప్రజల ప్రాణాల భద్రతే ముఖ్యమని అధికారులు స్పష్టం చేశారు.




