Kakinada: కాకినాడలో ఘనంగా స్టైఫండరీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్!

Kakinada: కాకినాడ మూడో ఏపీఎస్పీ బెటాలియన్‌లో ఘనంగా స్టైఫండరీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్. హాజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎస్పీ బిందు మాధవ్.

P Trimurthulu, Kakinada Rural
Published on: 26 Sept 2026 10:47 AM IST
Kakinada
X

Kakinada: కాకినాడలో ఘనంగా స్టైఫండరీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్!

Kakinada: కాకినాడ మూడో ఏపీఎస్పీ బెటాలియన్‌ మైదానంలో స్టైఫండరీ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న 280 మంది స్టైఫండరీ కానిస్టేబుళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీఎస్పీ కమాండెంట్ కె. నవీన్ కుమార్ కానిస్టేబుళ్లతో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, అడిషనల్ కమాండెంట్ దేవానందరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లోకి అడుగుపెడుతున్న 280 మంది కానిస్టేబుళ్లకు అభినందనలు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు ప్రజలకు సేవలందించడంలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

కానిస్టేబుళ్లకు స్టైఫండ్ పెంపు

గత ప్రభుత్వ హయాంలో స్టైఫండరీ కానిస్టేబుళ్లకు రూ.4,500 స్టైఫండ్ చెల్లించగా, తమ ప్రభుత్వం రూ.12 వేలకు పెంచిందని మంత్రి తెలిపారు. పోలీసు వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ఇప్పటికే 6 వేల కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేశామని, రానున్న నెలల్లో మరిన్ని వేలాది పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

గతంలో ఏపీఎస్పీ మైదానాన్ని ప్రైవేటు సంస్థకు అప్పగించే ప్రయత్నాలు జరిగాయని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మైదానం నీటమునిగినప్పటికీ, కేవలం 20 గంటల్లోనే మైదానాన్ని పరేడ్‌కు సిద్ధం చేయడంపై అభినందనలు తెలిపారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. డీఎస్సీ ద్వారా 16,437 మంది ఉద్యోగాలు పొందడం నిరుద్యోగుల్లో ఆనందాన్ని నింపిందని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

P Trimurthulu, Kakinada Rural

P Trimurthulu, Kakinada Rural