Pithapuram: పాదగయ క్షేత్రంలో కార్తీకమాస ఏర్పాట్లను పరిశీలించిన ఉప కమిషనర్!

Pithapuram: పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీకమాస ఏర్పాట్లను కాకినాడ దేవదాయ శాఖ ఉప కమిషనర్ డి.ఎల్.వి. రమేష్ బాబు శనివారం పరిశీలించారు.

RAMA KRISHNA, KKD
Published on: 14 Nov 2026 7:26 PM IST
Pithapuram
X

Pithapuram: పాదగయ క్షేత్రంలో కార్తీకమాస ఏర్పాట్లను పరిశీలించిన ఉప కమిషనర్!

పిఠాపురం: పిఠాపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం (పాదగయ క్షేత్రం)ను ఈరోజు కాకినాడ దేవదాయ ధర్మదాయ శాఖ ఉప కమిషనర్ డి.ఎల్.వి. రమేష్ బాబు సందర్శించి, పవిత్ర కార్తీకమాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.

ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న దర్శన సౌకర్యాలు, క్యూలైన్ల నిర్వహణ, ఉచిత ప్రసాద వితరణ, అన్నప్రసాద వితరణ తదితర ఏర్పాట్లను ఉప కమిషనర్ సమీక్షించి, సంబంధిత అధికారులు మరియు సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ముఖ్యంగా కార్తీకమాసంలో, ప్రత్యేకించి సోమవారాలు మరియు పర్వదినాలలో అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, క్రమబద్ధంగా, సజావుగా స్వామివారి దర్శనం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే భక్తులందరికీ ఉచిత ప్రసాదం సక్రమంగా అందేలా చూడాలని, అన్నప్రసాద వితరణలో నాణ్యత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి, పవిత్ర కార్తీకమాసంలో భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఉప కమిషనర్ సూచించారు.

ఆయన వెంట కాకినాడ జిల్లా దేవదాయ శాఖ తనిఖీదారు వడ్డీ ఫణీంద్ర కుమార్, ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.

RAMA KRISHNA, KKD

RAMA KRISHNA, KKD