U. Kothapalli: తుఫాను ముప్పు వేళ తీరప్రాంతాల్లో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పర్యటన!

U. Kothapalli: కాకినాడ జిల్లాపై అర్నబ్ తుఫాను ప్రభావం. యు.కొత్తపల్లి, తొండంగి తీరప్రాంతాల్లో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పర్యటన. పునరావాస కేంద్రాలకు తరలాలని విజ్ఞప్తి.

MANIKANTA, TUNI
Published on: 26 Oct 2026 10:29 PM IST
U. Kothapalli
X

U. Kothapalli: తుఫాను ముప్పు వేళ తీరప్రాంతాల్లో కలెక్టర్ హరేంధిర ప్రసాద్ పర్యటన!

యు.కొత్తపల్లి: తుఫాను ముప్పు కాకినాడ జిల్లాపై తీవ్రంగా ఉండనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సోమవారం సాయంత్రం తీర ప్రాంత మండలాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. అసిస్టెంట్ ప్రియాతో కలిసి పర్యటించిన ఆయన, తుఫాను ముందస్తు సన్నాహక చర్యలను స్వయంగా పరిశీలించారు.

కొత్తచోడిపల్లి పేటలో ప్రజలతో భేటీ

పర్యటనలో భాగంగా తొండంగి మండలంలో సముద్ర తీరానికి అతి దగ్గరగా ఉండే కొత్తచోడిపల్లి పేట గ్రామాన్ని స్థానిక అధికారులతో కలిసి కలెక్టర్ సందర్శించారు. అక్కడి మత్స్యకార ప్రజలతో నేరుగా మాట్లాడి, తుఫాను తీవ్రతను వివరించారు. ప్రభుత్వం యంత్రాంగం చేపట్టిన సహాయక చర్యలను తెలియజేస్తూ, లోతట్టు ప్రాంత ప్రజలు ముందుగానే పునరావాస కేంద్రాలకు చేరుకుని సురక్షితంగా ఉండాలని కోరారు.

తీరప్రాంత జనవాసాల పరిశీలన

అనంతరం పెరుమల్లపురం మీదిగా ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని సుబ్బంపేట, సురాడ పేట, కొనపాపుపేట గ్రామాల్లో కలెక్టర్ పర్యటించారు. సురాడ పేటలో సముద్ర తీరానికి అత్యంత సమీపంలో ఉన్న జనవాసాలను పరిశీలించి, అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాను ముప్పు తొలగే వరకు ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మంగళవారం మధ్యాహ్నం నుంచే సదుపాయాలు

ఈ సందర్భంగా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మాట్లాడుతూ, రానున్న రెండు రోజుల పాటు జిల్లాపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసిందన్నారు. లోతట్టు, తీర ప్రాంత ప్రజలు వెంటనే పునరావాస కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచే ఈ కేంద్రాల్లో భోజనం, తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలిరావాలని కోరారు.

ఈ పర్యటనలో కాకినాడ ఆర్డీవో ఎస్. మల్లిబాబు, పిఠాపురం పాడా పీడీ డాక్టర్ ఎన్. శివరాం ప్రసాద్, పౌరసరఫరాల సంస్థ డీఎం ఆనంద్ రావు, తొండంగి తహసీల్దార్ టి. కాంతారావు, ఎంపీడీవో ఉమామైతిలి, యు.కొత్తపల్లి తహసీల్దార్ జి. చిన్నారావు, ఎంపీడీవో లక్ష్మి రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.

MANIKANTA, TUNI

MANIKANTA, TUNI