Jaggampeta: అరాచకాలతో గెలిచి ధర్మం అనడం హాస్యాస్పదం: సూర్యచంద్ర
Jaggampeta: అధికార దుర్వినియోగంతో గెలిచి ధర్మబద్ధమైన విజయమనడం హాస్యాస్పదమని చంద్రబాబు, జ్యోతుల నెహ్రూలపై వైఎస్సార్సీపీ నేత పాటంశెట్టి సూర్యచంద్ర మండిపడ్డారు.
Jaggampeta: అరాచకాలతో గెలిచి ధర్మం అనడం హాస్యాస్పదం: సూర్యచంద్ర
జగ్గంపేట: కార్పొరేషన్, మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార బలాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతూ, పోలీసు కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తూ, నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటూ, పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు లేకుండా చేసి, చివరకు కౌంటింగ్ ప్రక్రియలో సైతం అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలిచిన వారు.. ఇప్పుడు నీతి, నిజాయితీ, ధర్మబద్ధంగా విజయం సాధించామని చెప్పుకోవడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్రంగా విమర్శించారు.
అరాచకాలు, దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగం, మద్యం, డబ్బు పంపిణీ వంటి అక్రమ మార్గాలతో సాధించిన విజయాన్ని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి సాధించిన విజయాన్ని ధర్మబద్ధమైన గెలుపుగా చెప్పుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే చెల్లిందని ఎద్దేవా చేశారు.
జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలో జడ్పీటీసీ ఎన్నికలపై మాట్లాడుతూ...
తన భార్య శ్రీదేవిని ఓడించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్లు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి సాధించింది ఏమిటని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రశ్నించారు.
2024 ఎమ్మెల్యే ఎన్నికలలో కిర్లంపూడి మండలంలో జ్యోతుల నెహ్రూ గారు సుమారు17000 ఓట్ల ఆధిక్యంతో పోలిస్తే ప్రస్తుతం సాధించిన మెజారిటీ, రాజకీయంగా వారి పరిస్థితిని తెలియజేస్తోందని అన్నారు. 4,800 ఓట్ల మెజారిటీతో సరిపెట్టుకోవాల్సి రావడం, తెలుగుదేశం పార్టీ ప్రజాదరణ తగ్గుతోందనడానికి నిదర్శనమని, ఆ పార్టీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయిందని సూర్యచంద్ర స్పష్టం చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అభినందనలు...
రాబోయే సర్పంచ్ ఎన్నికలే లక్ష్యం!
జగ్గంపేట నియోజకవర్గంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ పాటంశెట్టి సూర్యచంద్ర అభినందనలు తెలియజేశారు. ప్రతికూల పరిస్థితులు, అధికార పార్టీ ఒత్తిళ్లు, అనేక ఇబ్బందులు ఎదురైనా ధైర్యంగా ఎన్నికల బరిలో నిలిచిన పార్టీ నాయకులు, కార్యకర్తల పోరాట స్ఫూర్తిని అభినందించారు.శ్రీ తోట నరసింహం గారి నాయకత్వంలో, శ్రీజ్యోతుల చంటిబాబు గారి సహకారంతో రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను, వార్డు మెంబర్లను గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా తాను నిరంతరం ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పాటంశెట్టి సూర్యచంద్ర స్పష్టం చేశారు.




