Samarlakota: మూడు బుక్ ఆఫ్ రికార్డులు కైవసం చేసుకున్న బత్తుల శ్రీనువాసు

Samarlakota: అరుదైన వ్యాధిగ్రస్తుల కోసం సేవలందిస్తూ మూడు బుక్ ఆఫ్ రికార్డులు కైవసం చేసుకున్న బత్తుల శ్రీనువాసును ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అభినందించారు.

SATYANARAYANA, JAGGAMPETA
Published on: 5 Oct 2026 7:28 PM IST
Samarlakota
X

Samarlakota: మూడు బుక్ ఆఫ్ రికార్డులు కైవసం చేసుకున్న బత్తుల శ్రీనువాసు

సామర్లకోట: అరుదైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం సామర్లకోటకు చెందిన బత్తుల శ్రీనువాసు చేస్తున్న సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఒక చిన్నారి కోసం మొదలైన ప్రయాణం నేడు అనేక మంది చిన్నారులకు ఆశాకిరణంగా మారింది.

వెన్ను కండరాల క్షీణతతో బాధపడుతున్న చిన్నారి పునర్విక కోసం బత్తుల శ్రీనువాసు తన సేవా ప్రయాణాన్ని ప్రారంభించాడు. పునర్విక చికిత్సకు భారీగా నిధులు అవసరమైన సమయంలో ఎంతోమంది దాతలు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పునర్విక చికిత్సకు అవసరమైన 6 కోట్ల రూపాయలను సమకూర్చేందుకు అండగా నిలిచి, శ్రీనువాసు చేస్తున్న కృషిని అభినందించాడు.

పునర్విక కోసం మొదలైన ఈ సేవా యాత్రను అక్కడితో ఆపకుండా, వెన్ను కండరాల క్షీణత, డుషెన్ కండరాల బలహీనత వంటి అరుదైన వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించాలని శ్రీనువాసు నిర్ణయించుకున్నాడు. హై ఆల్టిట్యూడ్ సైకిల్ యాత్రలు, అవగాహన సదస్సులు, సామాజిక కార్యక్రమాల ద్వారా బాధిత చిన్నారుల కష్టాలను ప్రపంచానికి చాటుతున్నాడు.

మూడు బుక్ ఆఫ్ రికార్డుల గుర్తింపు:

శ్రీనువాసు చేస్తున్న ఈ నిరంతర కృషికి గుర్తింపుగా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి గుర్తింపు లభించింది. ఈ మూడు రికార్డులను తన వ్యక్తిగత విజయంగా కాకుండా, అరుదైన వ్యాధులపై సమాజంలో చైతన్యం తీసుకురావడానికి లభించిన గౌరవంగా శ్రీనువాసు భావిస్తున్నాడు.

జగ్గంపేటలో రికార్డుల ప్రదర్శన:

ఈ రోజు రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బత్తుల శ్రీనువాసు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను కలిసి తాను సాధించిన మెడల్స్ మరియు మూడు బుక్ ఆఫ్ రికార్డుల పత్రాలను చూపించాడు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శ్రీనువాసును ప్రత్యేకంగా అభినందించాడు. శ్రీనువాసు ప్రతిభను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చాడు.

మోసెస్ రాయల్ కు 2 లక్షల సాయం:

ఇదే సమయంలో వెన్ను కండరాల క్షీణత టైప్ 2 తో బాధపడుతున్న చిన్నారి మోసెస్ రాయల్ వైద్య పరీక్షల విషయం ప్రస్తావనకు వచ్చింది. చిన్నారికి అవసరమైన వైద్య పరీక్షల కోసం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించాడు. ఈ సహాయంతో చిన్నారి వైద్య పరీక్షలు సకాలంలో జరిగి తదుపరి చికిత్సకు మార్గం సుగమం కానుంది.

ఈ సందర్భంగా బత్తుల శ్రీనువాసు మాట్లాడుతూ...

రికార్డులు సాధించడం నా ప్రయాణంలో ఒక గుర్తింపు మాత్రమే, అరుదైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల సమస్యలను సమాజం ముందుకు తీసుకురావడం, వారికి అవసరమైన సమయంలో సహాయం అందేలా చేయడమే నా ప్రధాన లక్ష్యం, పునర్విక నుంచి మోసెస్ రాయల్ వరకు ఈ సేవా ప్రయాణం ఆగదు అని తెలిపాడు. అరుదైన వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ప్రజలు, దాతలు, ప్రజాప్రతినిధులు అండగా నిలవాలని కోరాడు.

SATYANARAYANA, JAGGAMPETA

SATYANARAYANA, JAGGAMPETA