Kadapa: ఖాజీపేట గోదాములో వరిధాన్యం నిల్వల్లో భారీ వ్యత్యాసం!

Kadapa: వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేట మండలం ఎంఎం రూరల్ ఫార్మర్స్ వేర్‌హౌస్‌లో విజిలెన్స్, మార్కెటింగ్ శాఖల సంయుక్త తనిఖీల్లో 987 బస్తాలు (57.91 టన్నుల) వరిధాన్యం వ్యత్యాసం గుర్తించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 13 Nov 2026 3:33 PM IST
Kadapa
X

Kadapa: ఖాజీపేట గోదాములో వరిధాన్యం నిల్వల్లో భారీ వ్యత్యాసం!

కడప: వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేట మండలంలోని సుంకేశుల రోడ్డులో ఉన్న ఎంఎం రూరల్ ఫార్మర్స్ వేర్‌హౌస్ గోదాములో వరిధాన్యం నిల్వల్లో భారీ వ్యత్యాసం వెలుగుచూసింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో రికార్డుల్లో ఉన్న నిల్వలకు, వాస్తవంగా గోదాములో ఉన్న ధాన్యానికి మధ్య తేడా ఉన్నట్లు గుర్తించారు.

ఈ నెల 12వ తేదీన నిర్వహించిన తనిఖీల్లో గోదాములోని వరిధాన్యం భౌతిక నిల్వలతో పాటు స్టాక్ రిజిస్టర్లు, ఇతర సంబంధిత రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ ప్రకారం గోదాములో 21,782 బస్తాలు, మొత్తం 14,93,915 కిలోల వరిధాన్యం నిల్వ ఉన్నట్లు నమోదు చేశారు. అయితే అధికారులు భౌతికంగా తనిఖీ చేయగా 20,795 బస్తాలు, 14,36,005 కిలోల ధాన్యం మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.

దీంతో రికార్డుల్లో నమోదైన నిల్వలకు, వాస్తవ నిల్వలకు మధ్య 987 బస్తాలు, 57,910 కిలోల (సుమారు 57.91 టన్నుల) వరిధాన్యం వ్యత్యాసం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యం నిల్వల భద్రత, గోదాముల నిర్వహణలో పారదర్శకత, రికార్డుల నిర్వహణలో క్రమశిక్షణకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రాధాన్యత ఇస్తుందని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు. రైతుల ప్రయోజనాలను పరిరక్షించే దిశగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR