Duvvur: ప్రపంచ మధుమేహ దినోత్సవం.. చింతకుంట పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ర్యాలీ!

Duvvur: దువ్వూరు మండలం చింతకుంట పీహెచ్‌సీ ఆధ్వర్యంలో వైద్యాధికారిణి డాక్టర్ వికసిత నిర్వహణలో ప్రపంచ మధుమేహ దినోత్సవ అవగాహన ర్యాలీ, సదస్సు జరిగాయి.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 14 Nov 2026 4:00 PM IST
Duvvur
X

Duvvur: ప్రపంచ మధుమేహ దినోత్సవం.. చింతకుంట పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ర్యాలీ!

దువ్వూరు: ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చింతకుంట ఆధ్వర్యంలో వైద్యాధికారిణి డాక్టర్ వికసితy నిర్వహణలో అవగాహన ర్యాలీతో పాటు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వికసిత మాట్లాడుతూ, “మధుమేహంపై ముందస్తు చర్యలు తీసుకుందాం” అనే ఈ ఏడాది ప్రధాన సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

మధుమేహ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య చికిత్స పొందడం ద్వారా వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చని తెలిపారు. అధిక దాహం, తరచుగా మూత్ర విసర్జన, ఆకలి పెరగడం, కారణం లేకుండా బరువు తగ్గడం, అలసట, చూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

ముఖ్యంగా 30 సంవత్సరాలు పైబడిన వారు, కుటుంబంలో మధుమేహ వ్యాధి చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవాలని తెలిపారు. మధుమేహ నివారణకు ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు నడక లేదా వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, ఆకుకూరలు, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వడం, అధిక చక్కెర పదార్థాలు, జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించడం, శరీర బరువును నియంత్రణలో ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని వివరించారు.

ఇప్పటికే మధుమేహం ఉన్నవారు వైద్యుల సూచనల మేరకు మందులు క్రమం తప్పకుండా వాడుతూ, చికిత్సను మధ్యలో ఆపకూడదని సూచించారు. ప్రభుత్వం మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న మధుమేహ నిర్ధారణ పరీక్షలు, వైద్యుల సంప్రదింపులు, అవసరమైన మందులు, ఆరోగ్య సలహాలు తదితర వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి రాజగోపాల్, ఆరోగ్య పర్యవేక్షకులు శివగంగరాజు, మల్లేశ్వరి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు (CHOలు), ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మధుమేహాన్ని ముందుగానే గుర్తించి, తగిన వైద్యం పొందుతూ ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR