Duvvuru: మాసనపల్లి స్కూల్లో ‘పొగాకు రహిత యువత 4.0’ సదస్సు

Duvvuru: దువ్వూరు మండలం మాసనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో చింతకుంట పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ‘పొగాకు రహిత యువత ప్రచారం 4.0’ అవగాహన సదస్సు నిర్వహించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 30 Oct 2026 5:29 PM IST
Duvvuru
X

Duvvuru: మాసనపల్లి స్కూల్లో ‘పొగాకు రహిత యువత 4.0’ సదస్సు

​దువ్వూరు: విద్యార్థులు, యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వికసిత పిలుపునిచ్చారు. గురువారం చింతకుంట పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఎం.ఎర్రబల్లి సచివాలయ పరిధిలోని మాసనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘పొగాకు రహిత యువత ప్రచారం 4.0’పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

​ఈ సందర్భంగా డాక్టర్ వికసిత మాట్లాడుతూ ధూమపానం, గుట్కా, ఖైనీ వంటి పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు, గుండె సంబంధిత వ్యాధులు, తీవ్ర శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చిన్న వయసులోనే వీటికి బానిసైతే విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు అక్టోబర్ 28 నుంచి డిసెంబర్ 27 వరకు 60 రోజులపాటు మండలవ్యాప్తంగా ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.

​ఎట్టి పరిస్థితుల్లోనూ చెడు వ్యసనాలకు లోనుకావద్దని, కుటుంబ సభ్యులు మరియు పరిసరాల్లో ఎవరైనా పొగాకు వాడుతుంటే వారికి కలిగే నష్టాలను వివరించి మాన్పించేందుకు విద్యార్థులు చొరవ చూపాలని సూచించారు. పాఠశాలలను, గ్రామాలను పొగాకు రహితంగా తీర్చిదిద్దడంలో యువత కీలకపాత్ర పోషించాలన్నారు.

​ఈ కార్యక్రమంలో హెల్త్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ రాజగోపాల్, ఆరోగ్య పర్యవేక్షకులు శివ గంగరాజు, మల్లేశ్వరి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR