Rayachoti: హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి
Rayachoti: రాయచోటిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ ట్రాఫిక్ సీఐ కృష్ణారెడ్డి, మెగా యూత్ ఫోర్స్ సభ్యులు ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.
Rayachoti: హెల్మెట్ ధరించండి.. సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోండి
రాయచోటి: ప్రతి వాహనదారుడు ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ సీఐ కృష్ణారెడ్డి సూచించారు. సినీ నటుడు సాయిధరమ్ తేజ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా యూత్ ఫోర్స్ రాయచోటి నియోజకవర్గ కన్వీనర్ బుడ్డా నాగభూషణ ఆధ్వర్యంలో బుధవారం రాయచోటిలో హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ట్రాఫిక్ సీఐ కృష్ణారెడ్డి, మెగా యూత్ ఫోర్స్ సభ్యులతో కలిసి వాహనదారులకు హెల్మెట్లు అందజేశారు. సుమారు రూ.26 వేల విలువైన 40 హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల సమయంలో తలకు తీవ్ర గాయాలయ్యే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాల రక్షణకు సహకరించాలని కోరారు.
ప్రమాదాల నివారణే లక్ష్యం
సినీ నటుడు సాయిధరమ్ తేజ్ గతంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన ఘటన తనను ఆలోచింపజేసిందని దాత బుడ్డా నాగభూషణ తెలిపారు. ఇలాంటి ప్రమాదాలు మరెవరికీ జరగకూడదనే ఉద్దేశంతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు, తన వంతు సహాయంగా మెగా యూత్ ఫోర్స్ సభ్యులతో కలిసి హెల్మెట్లను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మెగా యూత్ ఫోర్స్ కో-కన్వీనర్ నిమ్మనపల్లి పవన్ కుమార్, సభ్యులు పఠాన్, పద్మావతి, ప్రదీప్, మన్సూర్, వీరవేంద్ర, విజయ్, కొండా, సంజీవ తదితరులు పాల్గొన్నారు...




