Rayachoti: 10వ తరగతి పరీక్ష ఫీజుల దోపిడీని అరికట్టాలి
Rayachoti: రాయచోటిలో 10వ తరగతి పరీక్ష ఫీజు పేరుతో రూ.1,500 నుంచి రూ.3,000 వసూలు చేస్తున్నారని పీడీఎస్‌యూ ఆగ్రహం; డీఈఓపై చర్యలకు డిమాండ్.
Rayachoti: 10వ తరగతి పరీక్ష ఫీజుల దోపిడీని అరికట్టాలి
రాయచోటి: పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజుల పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేయడాన్ని తక్షణమే అరికట్టాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న డిమాండ్ చేశారు. రాయచోటి పట్టణంలో బుధవారం మాసాపేటలో పీడీఎస్ యు సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష ఫీజును రూ.125గా నిర్ణయించగా, కొన్ని విద్యాసంస్థలు రూ.1,500 నుంచి రూ.3000 వరకు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, ఇది పేద, మధ్యతరగతి తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపడమేనని విమర్శించారు.
అన్నమయ్య జిల్లా డీఈఓ సుబ్రహ్మణ్యం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విద్యారంగ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని అంకన్న మండిపడ్డారు. ప్రైవేట్ విద్యాసంస్థల అధిక ఫీజుల వసూళ్లు కొనసాగుతున్నా పట్టించుకోకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని, విద్యార్థుల సమస్యలపై స్పందించాల్సిన డీఈఓ నిద్ర మత్తులో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇప్పటికైనా డీఈఓ స్పందించి అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై విచారణ చేపట్టి, అదనంగా వసూలు చేసిన మొత్తాలను విద్యార్థులకు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా నాయకులు అదనాన్, అబుసర్, గణేష్, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.




