Rayachoti: ప్రజల ఆదరాభిమానాలు ఎప్పటికీ మరువలేనివి రాంప్రసాద్ రెడ్డి!
Rayachoti: చిన్నమండెం ప్రజల ఆదరాభిమానాలు ఎప్పటికీ మరువలేనివని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష.
Rayachoti: ప్రజల ఆదరాభిమానాలు ఎప్పటికీ మరువలేనివి రాంప్రసాద్ రెడ్డి!
Rayachoti: చిన్నమండెం ప్రజలు 1985 నుంచి నేటి వరకు తమ కుటుంబంపై చూపిస్తున్న ఆదరాభిమానాలు, అందిస్తున్న సహకారం ఎప్పటికీ మరువలేనిదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తన తండ్రి సంపాదించిన మంచి పేరును నిలబెట్టుకోవడంతో పాటు ప్రజల నమ్మకాన్ని కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. తన 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచింది చిన్నమండెం ప్రజలేనని, తాను చేసిన కష్టం కంటే ప్రజల ఆదరాభిమానాలే తనకు అసలైన బలమని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదం, సహకారంతోనే నేడు ఈ స్థాయికి చేరుకున్నానని, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో మరింత బాధ్యతగా ప్రజలకు సేవ చేస్తున్నానని స్పష్టం చేశారు.
రాయచోటి నియోజకవర్గంలో జరిగిన ఏకగ్రీవ ఎన్నికలు ప్రజల విశ్వాసానికి, అభివృద్ధికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే తొలిసారిగా రాయచోటి మున్సిపాలిటీలో 44కు 44 స్థానాలు ఏకగ్రీవం కావడం చారిత్రాత్మకమని అన్నారు. గతంలో చిన్నమండెం నుంచి ఎంపీపీగా పనిచేసిన నాయకులు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారని, ప్రజలకు మంచి చేసే నాయకులకు మాత్రమే తాను మద్దతుగా నిలుస్తానని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలోనే కోట్లాది రూపాయలతో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టామని వివరించారు. సుమారు రూ.650 కోట్లతో శ్రీనివాసపురం రిజర్వాయర్ పనులు కొనసాగుతున్నాయని, నియోజకవర్గంలోని 850 పల్లెలకు రూ.450 కోట్లతో జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు అందించే పనులు చేపడుతున్నామని తెలిపారు. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రెండున్నరేళ్లలో భారీ సంఖ్యలో తాగునీటి బోర్లు ఏర్పాటు చేశామని, ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకుల నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తున్నామని చెప్పారు. తాగునీరు, సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు.
రానున్న ఆరు నెలల్లో మార్కెట్ యార్డును ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని, సుమారు రూ.14 కోట్లతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు. రెండున్నరేళ్లలోనే 150 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, విద్యుత్ సమస్యల శాశ్వత పరిష్కారానికి కొత్త సబ్‌స్టేషన్ నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. రాయచోటి నియోజకవర్గంలో ప్రతి రంగానికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పనులు చేపడుతున్నామని, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ శక్తివంచన లేకుండా అండగా నిలవడమే తమ లక్ష్యమని అన్నారు.
తెలుగుదేశం పార్టీని నమ్ముకుని కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన రాజకీయ గుర్తింపు, సముచిత గౌరవం కల్పిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. కార్యకర్తల కష్టాన్ని గుర్తించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం తమ బాధ్యతని పేర్కొన్నారు. చిన్నమండెం ప్రజలు తనపై చూపిన ప్రేమాభిమానాలకు అభివృద్ధి రూపంలో రుణం తీర్చుకుంటానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని మంత్రి స్పష్టం చేశారు.
డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనించాలని కోరారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో చిన్నమండెం మండల అభివృద్ధికి మరింత కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలంటే ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొంటూ, తనకు మద్దతుగా నిలిచి సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ చిన్నమండెం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.




