Rayachoti: వెలిగల్లు ప్రాజెక్టు పరిశీలన.. నాణ్యమైన నీరే లక్ష్యం

Rayachoti: రాయచోటిలో మంత్రి మండిపల్లి సూచన మేరకు వెలిగల్లు ఇంటెక్ వెల్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను పరిశీలించిన చైర్మన్ బోనమల ఖాదర్ వలి; నివేదికకు ఆదేశం.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 25 Nov 2026 5:39 PM IST
Rayachoti
X

Rayachoti: వెలిగల్లు ప్రాజెక్టు పరిశీలన.. నాణ్యమైన నీరే లక్ష్యం

రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన మంచినీటిని అందించడమే లక్ష్యంగా వెలిగల్లు ప్రాజెక్టుపై మున్సిపల్ చైర్మన్ బోనమల ఖాదర్ వలి ప్రత్యేక దృష్టి సారించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచనల మేరకు బుధవారం వెలిగల్లు ప్రాజెక్టులోని ఇంటెక్ వెల్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్ అధికారులు, డీఈ, పలువురు కౌన్సిలర్లతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఇంటెక్ వెల్‌లోని మోటార్ల పనితీరు, మరమ్మతులు, జనరేటర్ పరిస్థితి, నీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం మూడు మోటార్లు ఉండగా రెండు పనిచేస్తున్నాయని, మరొకటి స్టాండ్‌బైలో ఉందని అధికారులు వివరించారు.

2012లో ఏర్పాటు చేసిన మోటార్ల సామర్థ్యం తగ్గిన నేపథ్యంలో కొత్త మోటార్లు ఏర్పాటు చేయాలా? లేక ప్రస్తుతం ఉన్న వాటికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలా? అనే అంశాలను పరిశీలించి అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను సందర్శించి నీటి శుద్ధి ప్రక్రియ, అలమ్ వినియోగం, ఫిల్టర్ మీడియా, క్లోరినేషన్ విధానాలను పరిశీలించారు.

ప్లాంట్‌లో మరమ్మతులకు గురైన మోటార్ల పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. గతంలో సకాలంలో యంత్ర పరికరాలకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల ప్రస్తుతం నీటి సరఫరాలో సమస్యలు తలెత్తుతున్నట్లు గుర్తించారు.నీటి సరఫరా వ్యవస్థలో ఉన్న సమస్యలు, మోటార్ల పనితీరు, మరమ్మతుల అవసరాలు, కొత్త పరికరాల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక సిద్ధం చేసి త్వరగా అందజేయాలని మున్సిపల్ కమిషనర్, డీఈలను ఆదేశించారు.

ఈ సందర్భంగా చైర్మన్ బోనమల ఖాదర్ వలి మాట్లాడుతూ.. రాయచోటి పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన మంచినీటిని నిరంతరాయంగా అందించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. నీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి, అవసరమైన చర్యలు చేపట్టి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కొట్టే చలపతి, నిర్మల్ కుమార్, జంగా ఈశ్వరయ్య, ఫయాజ్, సాయి, మహమ్మద్ అలీ, గంగాధర్, సతీష్ తదితరులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI