Rajampet: అన్నమయ్య ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి
Rajampet: రాజంపేటలో అన్నమయ్య ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. జర్నలిస్టులకు రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు.
Rajampet: అన్నమయ్య ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి
రాజంపేట: కడప జిల్లా రాజంపేట పట్టణంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను అన్నమయ్య ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజంపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్థానిక మహాత్మా గాంధీ విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం క్యాండిల్స్ వెలిగించి బాపూజీ గొప్పతనాన్ని, ఆయన అందించిన సత్యం, అహింస సందేశాలను స్మరించుకున్నారు.
ఈ వేదికగా మాట్లాడిన జర్నలిస్టులు... మహాత్మా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమాలను ప్రజలకు చేరవేయడానికి పత్రికలను అత్యంత శక్తివంతమైన అక్షర ఆయుధాలుగా వాడుకున్నారని గుర్తుచేశారు. కానీ, నేడు సమాజానికి వెలుగునిచ్చే జర్నలిస్టులకే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యానికి నాలుగో స్థంబంగా నిలుస్తున్న జర్నలిస్టులకు పూర్తి రక్షణ కల్పించేలా ప్రత్యేకంగా 'జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్' (రక్షణ చట్టం)ను వెంటనే ప్రభుత్వాలు అమలులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా బలంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అన్నమయ్య ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రఘురామరాజుతో పాటు గుండ్రాతి విజయ్ కుమార్, నరసింహులు, విక్రమ్, జయరాజు, నాగేంద్ర, అశోక్ బాబు, అనిల్ కుమార్, సురేష్ బాబు, కార్తీక్, వెంకటేశ్వర్లు, హరి, చిన్న, సాయి తదితర జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు.




