Pulivendula: పులివెందుల మున్సిపల్ పీఠం మహిళలకే
Pulivendula: పులివెందుల మున్సిపాలిటీ చైర్‌పర్సన్ స్థానం మహిళకు కేటాయింపుతో సమీకరణాలు మారాయి. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ప్రమీలమ్మ, టీడీపీ తరఫున గీతాకుమారి ఖరారు.
Pulivendula: పులివెందుల మున్సిపల్ పీఠం మహిళలకే
పులివెందుల: పులివెందుల మున్సిపాలిటీ చైర్‌పర్సన్ పదవిని జనరల్ మహిళా కేటగిరీకి కేటాయించడంతో పట్టణంలో రాజకీయ సమీకరణాలు మారాయి. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ వైఎస్ ప్రమీలమ్మ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా, తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ తూగుట్ల మధుసూదన్ రెడ్డి సతీమణి తూగుట్ల గీతాకుమారిని బరిలోకి దింపేందుకు పార్టీ నాయకత్వం దాదాపుగా నిర్ణయించినట్లు సమాచారం.
ఈ మేరకు బుధవారం టీడీపీ కార్యాలయంలో నిర్వహించనున్న కార్యకర్తల సమావేశంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్ రవి అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి జనరల్ కేటగిరీకి కేటాయిస్తారని తొలుత భావించిన నేపథ్యంలో తూగుట్ల మధుసూదన్ రెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. ఈ క్రమంలో ఆయన గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
అయితే, తాజాగా చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళా కేటగిరీకి కేటాయించడంతో అభ్యర్థి ఎంపికలో మార్పు చోటుచేసుకుంది.ఈ నేపథ్యంలో తన సతీమణి తూగుట్ల గీతాకుమారిని ఎన్నికల బరిలోకి దింపాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పార్టీ పెద్దలు చర్చలు జరిపి ఆమె పేరును దాదాపుగా ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అధికారిక ప్రకటన వెలువడితే టీడీపీ అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది.మరోవైపు, వైకాపా ఇప్పటికే వైఎస్ ప్రమీలమ్మ పేరును ప్రకటించడంతో ఇరు ప్రధాన పార్టీల మధ్య మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటించిన అనంతరం అనంతరం ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకునే అవకాశం ఉంది. దీంతో పులివెందుల మున్సిపల్ ఎన్నికల్లో చైర్‌పర్సన్ అభ్యర్థుల ఎంపికపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.




