Proddatur: బీసీల హక్కులను కాలరాశారు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై రాచమల్లు మండిపాటు

Proddatur: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపణ.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 2 Nov 2026 9:25 PM IST
Proddatur
X

Proddatur: బీసీల హక్కులను కాలరాశారు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిపై రాచమల్లు మండిపాటు

​ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవి కేటాయింపు అంశం స్థానికంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వైఖరితో బీసీలకు తీవ్ర రాజకీయ అన్యాయం జరిగిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఓసీలకు కేటాయించాలంటూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి లేఖ రాయడంపై ఆయన మండిపడ్డారు. బీసీల నుంచి సమర్థవంతమైన నాయకత్వం రాదనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ లేఖ రాయడం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని విమర్శించారు.

కేవలం తన సోదరుడు నంద్యాల రాఘవరెడ్డిని చైర్మన్ చేయడానికి రిజర్వేషన్ల మార్పు నుంచి ఎన్నికల ప్రక్రియ వరకు అన్నింటినీ తనకు అనుకూలంగా మలుచుకున్నారని ఆరోపించారు. ప్రొద్దుటూరులో ఓటు హక్కు లేని రాఘవరెడ్డికి హైకోర్టు లంచ్ మోషన్ ద్వారా ఓటు నమోదు చేయించడంపై జిల్లా కలెక్టర్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

నామినేషన్ల వేళ ప్రత్యర్థులను అడ్డుకోవడం, పేపర్లు చించివేయడం, ఉపసంహరణ సమయాల్లో ఒత్తిళ్లు తీసుకురావడం ద్వారా సాధించిన ఏకగ్రీవాలు ప్రజా మద్దతు కాదన్నారు. కొత్త పాలకవర్గం అధికారంలోకి వస్తే ఎగ్జిబిషన్ ఆదాయం, బొల్లవరం ప్లాట్ల విక్రయాల్లో అక్రమాలు జరిగే అవకాశం ఉందని, ప్రజా ఆస్తుల పరిరక్షణకు వైసీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR