Proddatur: సీఎం చంద్రబాబు, పవన్ పర్యటనపై రాచమల్లు తీవ్ర విమర్శలు

Proddatur: ప్రొద్దుటూరులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్యటన కేవలం ప్రచార ఆర్భాటమేనని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 5 Oct 2026 7:44 PM IST
Proddatur
X

Proddatur: సీఎం చంద్రబాబు, పవన్ పర్యటనపై రాచమల్లు తీవ్ర విమర్శలు

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనపై వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ, భారీగా ప్రచార ఆర్భాటాలకే ప్రాధాన్యమిచ్చారని ఆయన ఆరోపించారు. ​ఐదు రోజుల పాటు సీఎం పర్యటన పేరుతో అనేక శాఖల అధికారులు, సిబ్బందిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని రాచమల్లు మండిపడ్డారు.

రెండు హెలికాప్టర్లలో వచ్చి ప్రొద్దుటూరులో సాధించిందేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు సభను సక్సెస్ చేయడం కోసం 2,000 బస్సులను కేటాయించి, డ్వాక్రా మహిళలను బలవంతంగా తీసుకురావడానికి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్‌ను కేవలం సినీ గ్లామర్ కోసమే చంద్రబాబు వెంట తిప్పుకుంటున్నారని, ఆ గ్లామర్ లేకపోతే చంద్రబాబు సభలు నిర్వహించుకోలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

రాబోయే రోజుల్లో పవన్ చాలక, కొత్త హీరోయిన్ల గ్లామర్ తెచ్చుకోవాల్సి వస్తుందేమోనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు. చంద్రబాబు పక్కనే ఇసుక దొంగలు కూర్చుంటున్నారని, శెట్టిపల్లె ప్రాంతంలో రోజుకు రూ. 30 లక్షల విలువైన ఇసుక అక్రమంగా అమ్ముకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నియోజకవర్గంలో అరాచకాలు, అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.

​తాగునీటి పథకాలపై 2023లోనే అమృత్ స్కీమ్‌ను పూర్తి చేస్తే, ఇప్పుడు కొత్తగా జల్ జీవన్ మిషన్ అంటూ చంద్రబాబు ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు.

​డబ్బు, మద్యం పంపిణీ: సభకు జనాలను రప్పించడానికి యథేచ్ఛగా మద్యం, డబ్బులు పంపిణీ చేశారని, ఇందుకు సంబంధించిన దృశ్యాలే ఆధారమని రాచమల్లు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని ఇంజన్లు వేసినా రాష్ట్రం ముందుకు సాగదని, కేవలం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని రాచమల్లు స్పష్టం చేశారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR