Proddatur: విఐపీలు వెళ్లగానే చెత్త కాష్టాలు: ప్రొద్దుటూరులో ధర్నా

Proddatur: సీఎం, డిప్యూటీ సీఎం పర్యటన ముగియగానే ప్రొద్దుటూరు అమృత నగర్‌లో చెత్త డంపింగ్ ప్రారంభించడంపై గ్రామస్తులు టెంట్ వేసి ధర్నాకు దిగారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 6 Oct 2026 5:09 PM IST
Proddatur
X

Proddatur: విఐపీలు వెళ్లగానే చెత్త కాష్టాలు: ప్రొద్దుటూరులో ధర్నా

Proddatur: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాక సందర్భంగా లక్షలాది రూపాయల ప్రజాధనం వెచ్చించి శుభ్రం చేసిన అధికారులు, వారు వెళ్లిపోగానే మళ్లీ పాత పద్ధతినే అవలంబిస్తున్నారు. విఐపిల పర్యటన ముగిసిన కొన్ని గంటల్లోనే కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని చెత్తనంతా తెచ్చి అమృత నగర్‌‌లోని నివాస ప్రాంతాల వద్ద పారబోసేందుకు అధికారులు యత్నించడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారుల నిర్లక్ష్యం ​విఐపిలు వస్తున్నారంటే పగలు, రాత్రి తేడా లేకుండా కష్టపడి, ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేసి చెత్తను తొలగించిన యంత్రాంగం, వారు వెళ్లిన వెంటనే గ్రామాన్ని మళ్లీ చెత్త కుప్పగా మార్చడానికి ప్రయత్నించడం అధికారుల బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోంది. చెత్తను సేకరించి ఒకచోట వేయడం, దానికి నిప్పు పెట్టడం తప్ప శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమయ్యారు.

​పొగతో శ్వాసకోశ వ్యాధులు, ఊపిరాడని గ్రామాలు ​24 గంటల పాటు కాలే చెత్త నుంచి వెలువడుతున్న దట్టమైన పొగ కారణంగా అమృత నగర్‌తో పాటు పొరుగున ఉన్న కానపల్లె, మడూరు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతూ ఆస్పత్రుల పాలవుతున్నారు. అమృత నగర్‌ను ‘చెత్త డంపింగ్ యార్డ్‌’గా మార్చవద్దని స్థానికులు రోడ్డెక్కారు. ఉదయం నుంచే టెంట్ వేసి నిరసన దీక్ష చేపడుతూ చెత్త తరలింపును అడ్డుకున్నారు.

​అధికారులపై చర్యలకు డిమాండ్

​కొత్తపల్లె పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, డిఎల్పిఓ, మరియు డిపిఓలు ఇప్పటికైనా స్పందించి అమాయక ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం మానాలని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని పేదలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR