Porumamilla: ₹6,800 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలి: ఏబీవీపీ!
Porumamilla: పెండింగ్‌లో ఉన్న ₹6,800 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి: పోరుమామిళ్ల అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏబీవీపీ భారీ నిరసన.
Porumamilla: ₹6,800 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలి: ఏబీవీపీ!
పోరుమామిళ్ల: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సుమారు ₹6,800 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)పోరుమామిళ్ల శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కడప విభాగ్ కన్వీనర్ అభిలాష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫీజు రీయంబర్స్‌మెంట్,స్కాలర్‌షిప్ లు సకాలంలో అందకపోవడంతో పేద, బడుగు,బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ఫీజులు చెల్లించలేక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని,బకాయిల కారణంగా విద్యార్థులు తమకు రావాల్సిన సర్టిఫికెట్లను యాజమాన్యాల దగ్గరినుంచి పొందడంలో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు.
విద్యార్థుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యార్థుల సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.ఎన్నికల సమయంలో విద్యార్థులకు అండగా ఉంటామని,వారి భవిష్యత్తుకు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ,విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థుల సమస్యలపై తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్‌లో ఉన్న సుమారు ₹6,800 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని,విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇకపై బకాయిలు పేరుకుపోకుండా సకాలంలో నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
లేని పక్షంలో రానున్న రోజుల్లో ఏబీవీపీ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్తీక్,గురు శివ,బ్రాహ్మయ్య, శోభ,యాసిన్, రితీష్,జయచంద్ర, మహేష్, శేఖర్, ముని, అజయ్, మధు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.




