Jammalamadugu: మైలవరం ఎస్సైపై చర్యలు తీసుకోవాలి: బాధితుడి కుటుంబం
Jammalamadugu: మైలవరం ఎస్సై శ్యాంసుందర్‌రెడ్డి దాడి చేయడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగానని బాధితుడు రాజమోహన్ ఆరోపించారు. ఎస్సైపై చర్యలకు డిమాండ్ చేశారు.
Jammalamadugu: మైలవరం ఎస్సైపై చర్యలు తీసుకోవాలి: బాధితుడి కుటుంబం
కడప జిల్లా: జమ్మలమడుగులో బాధితుడి తండ్రి రంగనాయకులు, తమ్ముడు రాజశేఖర్ మీడియాకు వివరాలు తెలిపారు. మైలవరం మండలం బుచ్చంపల్లె గ్రామంలో బుధవారం వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుందన్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఇరువర్గాల వారిని గురువారం మైలవరం ఎస్సై పోలీస్ స్టేషన్‌కు పిలిపించినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే గొడవకు సంబంధించిన వారిని వదిలేసి, రాజమోహన్‌ను మాత్రమే ఎస్సై అనవసరంగా కొట్టారని అతని తండ్రి రంగనాయకులు,తమ్ముడు రాజశేఖర్ ఆరోపించారు.
దీంతో మనస్తాపానికి గురైన రాజమోహన్ జమ్మలమడుగు పోలీస్ స్టేషన్ ఎదుట విషద్రావణం తాగినట్లు తెలిపారు. వెంటనే పోలీసులు అతడిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
బాధితుడు రాజమోహన్ మీడియాతో మాట్లాడుతూ మైలవరం ఎస్ఐ పై చర్యలు తీసుకోకపోతే మళ్లీ ప్రాణ త్యాగానికి సిద్ధమని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ జరిపి, మైలవరం ఎస్సైపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.




