Mydukur: 9 మద్యం దుకాణాలకు దరఖాస్తులు అక్టోబర్ 8న లాటరీ
Mydukur: మైదుకూరు ఎక్సైజ్ పరిధిలో 9 మద్యం దుకాణాలకు అక్టోబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 8న కలెక్టరేట్‌లో బహిరంగ లాటరీ నిర్వహిస్తారు.
Mydukur: 9 మద్యం దుకాణాలకు దరఖాస్తులు అక్టోబర్ 8న లాటరీ
మైదుకూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన మద్యం పాలసీ 2026–27లో భాగంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. లాటరీ విధానంలో పారదర్శకంగా మద్యం దుకాణాల లైసెన్సులను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.
మైదుకూరు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 9 జనరల్ కేటగిరీ మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటిలో మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో 6, రూరల్ పరిధిలో 1, దువ్వూరు మండలంలో 2 దుకాణాలు ఉన్నాయి.మద్యం దుకాణాల లైసెన్సుల కోసం 2026 సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 6 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో లేదా మైదుకూరు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రతి దరఖాస్తుకు రూ.1,000 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి దరఖాస్తుతో పాటు రూ.3 లక్షల నాన్-రిఫండబుల్ డీడీని ‘జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి, వైఎస్ఆర్ కడప’ పేరిట సమర్పించాలి. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అనంతరం లభించే చలానా ద్వారా సమీప ట్రెజరీ లేదా బ్యాంకులో రూ.3 లక్షలు చెల్లించి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
దరఖాస్తుల ఎంపిక ప్రక్రియను అక్టోబర్ 8న వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బహిరంగ లాటరీ పద్ధతిలో నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని అధికారులు తెలిపారు.నూతన మద్యం పాలసీ ప్రకారం లైసెన్స్ ఫీజును ప్రభుత్వం నిర్ణయించిన మొత్తాన్ని నాలుగు సమాన విడతల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. అదేవిధంగా పర్మిట్ రూమ్ లైసెన్స్ ఫీజును మూడు సమాన విడతల్లో చెల్లించే అవకాశం కల్పించినట్లు ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు.నూతన మద్యం పాలసీ 2027 సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.




