Kadapa: కడపలో భారీ ఎర్రచందనం పట్టివేత 8 మంది అరెస్ట్!

Kadapa: కడప జిల్లాలో కాఫీ పొడి ప్యాకెట్ల లోడు మాటున ఎర్రచందనం తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు. రూ.1.30 కోట్ల విలువైన దుంగలు స్వాధీనం.

G. RAVI KUMAR, KADAPA
Published on: 14 Oct 2026 2:20 PM IST
Kadapa
X

Kadapa: కడపలో భారీ ఎర్రచందనం పట్టివేత 8 మంది అరెస్ట్!

Kadapa: కడప జిల్లాలో భారీగా ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కాఫీ పొడి ప్యాకెట్ల లోడు మాటున ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఎనిమిది మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి దాదాపు రెండు టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

ఎస్.ఏ. కాశినాయన మండలం ఆకుల నారాయణపల్లె సమీపంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కాఫీ పొడి ప్యాకెట్ల లోడు చాటున ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ముఠాను గుర్తించారు.

నిందితుల నుంచి 1.984 టన్నుల బరువున్న 70 ఎర్రచందనం దుంగలు, మూడు వాహనాలు, 643 కాఫీ పౌడర్ అట్టపెట్టెలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు రూ.1.30 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు.

పోలీసులను చూసిన స్మగ్లర్లు గొడ్డళ్లు, రాళ్లతో దాడికి యత్నించినట్లు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వెల్లడించారు. అరెస్టయిన వారిలో తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరు ఉన్నారు. మరికొందరు నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

ఎర్రచందనం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. పునరావృత నేరస్తులపై అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

G. RAVI KUMAR, KADAPA

G. RAVI KUMAR, KADAPA