Mydukur: ఘనంగా ఓం అవధూత కొండయ్యస్వామి 45వ జన్మదిన వేడుకలు!
Mydukur: మైదుకూరులో ఓం అవధూత కొండయ్యస్వామి 45వ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. 3,000 కేజీల భారీ కేక్‌ను కట్ చేసి పంపిణీ చేశారు. జబర్దస్త్ హాస్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
Mydukur: ఘనంగా ఓం అవధూత కొండయ్యస్వామి 45వ జన్మదిన వేడుకలు!
మైదుకూరు: మైదుకూరు నీళ్లస్వామి గ్రామంలోని పూసయ్యగారి ఆశ్రమం, ధరణి తిమ్మాయపల్లె గ్రామం, మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో ఓం అవధూత కొండయ్యస్వామి వారి 45వ జన్మదిన వేడుకలు గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవధూత కొండయ్యస్వామి వారు స్వయంగా 3,000 కేజీల భారీ కేక్‌ను కట్ చేసి భక్తులకు పంపిణీ చేశారు. స్వామివారి జన్మదిన వేడుకలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
ఓం కొండయ్యస్వామి వారి భక్తబృందం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులకు నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు. ఛాబాల, వజ్రకరూరు, పాతపల్లె, యల్లనూరు, ఉరవకొండ గ్రామాలకు చెందిన భక్తులు వంట కార్యక్రమాల్లో పాల్గొని అన్నదాన సేవలు అందించారు.
వేడుకల్లో భాగంగా రాయలసీమ వృత్తి కళాకారుల సంఘం కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చెక్కభజన, విశ్వనాథపురానికి చెందిన అశోక్ కోలాట బృందం ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శన, డేగపూడి భజన బృందం ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. అగ్నిగుండ ప్రవేశం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
రాత్రి 9 గంటలకు నరసరావుపేట ప్రభ బృందం ఆధ్వర్యంలో ప్రభ కార్యక్రమం, బద్వేల్‌కు చెందిన శివసాయి ఈవెంట్స్ వారిచే ఆర్కెస్ట్రా నిర్వహించారు. అలాగే జబర్దస్త్ ప్రముఖ కళాకారులు హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్, రైజింగ్ రాజు, దొరబాబు, సన్నీ, నూకరాజు, శాంతి స్వరూప్, సాయి వర్షిని, హరిత బృందం తమ హాస్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. శ్రీ సాయి నాట్య కళాసమితి, అద్దంకి శ్రీనివాసరావు బృందం ఆధ్వర్యంలో గయోపాఖ్యానం యుద్ధ సన్నివేశం, చింతామణి పూర్తి నాటకాన్ని ప్రదర్శించారు.
శుక్రవారం రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు
జన్మదిన వేడుకల్లో భాగంగా నవంబర్ 6వ తేదీ శుక్రవారం ఉదయం 6 గంటలకు రాష్ట్రస్థాయి వృషభరాజములకు ప్రత్యేక బండలాగుడు పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు అప్పరాజపేట, బద్వేల్‌కు చెందిన ప్రైమ్ కామన్ ఫౌండేషన్ దాత బొమ్మన సుబ్బరాయుడు సహకారం అందిస్తున్నారు. భక్తబృందం ఆధ్వర్యంలో వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. స్వామివారి జన్మదిన వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.




