Duvvur: శ్రీ పార్వతీదేవి అలంకారంలో కన్యకాపరమేశ్వరి దర్శనం వైభవంగా పూజలు!
Duvvur: దువ్వూరు శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాల్లో మూడవ రోజు శ్రీ పార్వతీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం. తరలివచ్చిన భక్తులు.
Duvvur: శ్రీ పార్వతీదేవి అలంకారంలో కన్యకాపరమేశ్వరి దర్శనం వైభవంగా పూజలు!
మైదుకూరు: మండల కేంద్రమైన దువ్వూరులోని శ్రీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు మంగళవారం నాడు అమ్మవారు శ్రీ పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.
ఈ సందర్భంగా ఆలయంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే విశేష పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో ప్రభాత సేవ, జపాలు, చండీ పారాయణం, మహానివేదన మరియు మహామంగళహారతి పూజలు నిర్వహించారు. అమ్మవారి దర్శనార్థం దువ్వూరుతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి కాయకర్పూరాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామని, భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేసినట్లు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆరవేటి సుబ్బారావు తెలిపారు. భక్తుల నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది.




