Mydukuru: రైతు పేరుతో నకిలీ పత్రాలతో రూ. 1.60 లక్షల క్రాప్ లోన్ స్వాహా!

Mydukuru: వైఎస్సార్ జిల్లా చాపాడు మండలంలో నకిలీ పత్రాలతో రైతు పేరుపై రూ. 1.60 లక్షల పంట రుణం స్వాహా. న్యాయం చేయాలని బాధిత రైతు పోలిరెడ్డి విజ్ఞప్తి.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 6 Nov 2026 12:47 PM IST
Mydukuru
X

Mydukuru: రైతు పేరుతో నకిలీ పత్రాలతో రూ. 1.60 లక్షల క్రాప్ లోన్ స్వాహా!

Mydukuru: రైతుకు తెలియకుండానే ఆయన పేరు మీద నకిలీ పత్రాలు సృష్టించి ఏకంగా రూ. 1.60 లక్షల పంట రుణం కాజేసిన ఘటన వైఎస్సార్ జిల్లా చాపాడు మండలంలో కలకలం రేపుతోంది. తనకు తెలియకుండా రుణం ఎలా మంజూరు చేశారంటూ ప్రశ్నించిన బాధిత రైతుకు న్యాయం చేయాల్సింది పోయి, బ్యాంకు సిబ్బంది కాలయాపన చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. చాపాడు మండలం సిద్ధారెడ్డిపల్లికి చెందిన పిచ్చిపాటి పోలిరెడ్డి అనే రైతు గత నెల 26న చింతకుంట యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖకు వెళ్లి పంట రుణం కోసం విచారించారు.

ఈ క్రమంలో బ్యాంకు రికార్డులను పరిశీలించగా, 2023 ఫిబ్రవరి 6న చాపాడు యూనియన్ బ్యాంక్ శాఖలో ఆయన పేరిట రూ. 1,60,000 క్రాప్ లోన్ మంజూరైనట్లు తేలింది. దీంతో పోలిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తనకు చాపాడు బ్రాంచీలో అసలు బ్యాంకు ఖాతానే లేదని, ఎలాంటి రుణం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.

వెంటనే రైతు తన కుమారుడితో కలిసి చాపాడు యూనియన్ బ్యాంకు శాఖను ఆశ్రయించి ఆరా తీయగా మరిన్ని విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బ్యాంకులో సమర్పించిన పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు తనవి కావని, వేరే చిరునామాతో నకిలీ పత్రాలు సృష్టించి ఖాతా తెరిచినట్లు గుర్తించారు.

ఈ లోన్ మంజూరు కోసం తన వ్యవసాయ భూమికి సంబంధించిన సర్వే నంబర్ 137-1 లోని 0.02 సెంట్లు, సర్వే నంబర్ 27 లోని 5.25 సెంట్ల వివరాలను అక్రమంగా ఉపయోగించారని రైతు కుటుంబం ఆరోపించింది.

ఈ భారీ గోల్‌మాల్‌పై అక్టోబర్ 26న విలేకరుల సమక్షంలో బ్యాంకు అధికారులను ప్రశ్నించగా, విచారణకు వారం రోజుల గడువు కోరారు. గడువు ముగిసిన తర్వాత బాధిత రైతు మళ్లీ వెళ్లగా.. "పై అధికారులకు లేఖ రాశాం, నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయి, వేచి చూడాలి" అంటూ దాటవేశారు.

ఇప్పటికి మూడుసార్లు బ్యాంకు చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఆ రూ. 1.60 లక్షల సొమ్ము ఏ ఖాతాలోకి జమ అయింది? నగదును ఎవరు విత్‌డ్రా చేసుకున్నారు? అనే ప్రాథమిక వివరాలు కూడా చెప్పేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా, లోన్ రికార్డులను ఆధారాల కోసం ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించగా.. "వీడియోలు తీస్తే మీపైనే కేసులు పెడతాం" అంటూ సిబ్బంది బెదిరింపులకు దిగారని రైతు కుమారుడు ఆరోపించారు.

​ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు

అసలు రైతు ప్రమేయం లేకుండా బ్యాంకు ఖాతా ఎలా తెరిచారు? భూమి పరిశీలన లేకుండా, నకిలీ పత్రాలతో రుణం ఎలా మంజూరు చేశారు? ఇందులో బ్యాంకు సిబ్బంది హస్తం ఎంతవరకు ఉంది? అనే అంశాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. బ్యాంకు మోసంపై తక్షణమే స్పందించి, బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుని, తమ భూమి రికార్డులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధిత రైతు పోలిరెడ్డి ఉన్నతాధికారులను, జిల్లా యంత్రాంగాన్ని వేడుకుంటున్నారు

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR