Proddatur: ఎమ్మెల్యే కుటుంబంపై రాచమల్లు సంచలన వ్యాఖ్యలు

Proddatur: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే కుటుంబంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. బీఫారాలను ఎంఆర్పీ ధరలకు అమ్ముతున్నారని ధ్వజమెత్తారు.

P. GURUSWAMI, PRODDUTUR
Published on: 22 Oct 2026 5:08 PM IST
Proddatur
X

Proddatur: ఎమ్మెల్యే కుటుంబంపై రాచమల్లు సంచలన వ్యాఖ్యలు

ప్రొద్దుటూరు: ​కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి స్థానిక ఎమ్మెల్యే కుటుంబంపై, పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుటుంబ పాలన కొనసాగుతోందని, ఆయనకు, తమ్ముడు రాఘవరెడ్డికి పదవి వ్యామోహం ఉంటే, కుమారుడు కొండారెడ్డికి డబ్బు వ్యామోహం పట్టుకుందని విమర్శించారు.

బీఫారంలను కొండారెడ్డి ఎంఆర్పి (MRP) ధరలకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఎంపీటీసీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, తమ పార్టీ నాయకులను హౌస్ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ వారే వైసీపీ పేరుతో డమ్మీ నామినేషన్లు వేయించి, స్క్రూటినీ సమయంలో వాటిని రిజెక్ట్ చేయించుకుని ఏకగ్రీవాలు చేయించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు.

టీడీపీ నాయకుల కోసం పోలీసులు బలిపశువులు కావద్దని రాచమల్లు హితవు పలికారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పోలీసులపై కేసులు నమోదు చేసి, ఉద్యోగాల నుండి తొలగిస్తామని హెచ్చరించారు. ప్రొద్దుటూరు ప్రజలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. మళ్లీ ఎన్నికలు జరిగి ఒక లక్ష ఓట్లు పోలైతే, అందులో 90 వేల ఓట్లతో వైసీపీ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

P. GURUSWAMI, PRODDUTUR

P. GURUSWAMI, PRODDUTUR