Duvvuru: చింతకుంటలో ఘనంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

Duvvuru: చింతకుంట పీహెచ్‌సీ పరిధిలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం. వైద్యాధికారి డాక్టర్ వికసిత ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 25 Sept 2026 5:59 PM IST
Duvvuru
X

Duvvuru: చింతకుంటలో ఘనంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

దువ్వూరు: పరిశుభ్రత పాటించడం, సకాలంలో ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం ద్వారా నులిపురుగుల సమస్యను సమర్థవంతంగా అరికట్టవచ్చని స్థానిక వైద్యాధికారి డాక్టర్ వికసిత పేర్కొన్నారు. చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బయనపల్లిలోని జ్ఞానజ్యోతి మార్థోమా ఉన్నత పాఠశాల తదితర విద్యాసంస్థల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.

​ఈ కార్యక్రమంలో డాక్టర్ వికసిత మాట్లాడుతూ.. పిల్లల్లో నులిపురుగుల వ్యాప్తి వల్ల రక్తహీనత, తీవ్ర నీరసం, కడుపునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని, ఇది వారి చదువుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. విద్యార్థులు గోర్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా కత్తిరించుకోవాలని, భోజనానికి ముందు, మలవిసర్జన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పాదరక్షలు ధరించాలని, మరుగుదొడ్లను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు.

​పీహెచ్‌సీ పరిధిలోని ఏడు సచివాలయాల పరిధిలో మొత్తం 3,960 మంది విద్యార్థులకు గాను ఇప్పటివరకు 3,885 మందికి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి, 97 శాతం కవరేజీ సాధించినట్లు తెలిపారు. మిగిలిపోయిన విద్యార్థులకు త్వరలోనే మాప్‌అప్ కార్యక్రమం ద్వారా మాత్రలు అందించి 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేస్తామని వివరించారు.

​ఈ కార్యక్రమంలో విస్తరణాధికారి రాజగోపాల్, ఆరోగ్య పర్యవేక్షకులు శివ గంగరాజు, మల్లేశ్వరి, సీహెచ్‌ఓ సౌభాగ్యలక్ష్మి, ఏఎన్‌ఎం ప్యారీ, ఆశా కార్యకర్త గంగాదేవి, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR