Duvvuru: దువ్వూరులో ఘనంగా వాసవి అమ్మవారి శమీ దర్శనం
Duvvuru: దువ్వూరు శ్రీ మరకత వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శరన్నవరాత్రుల ముగింపు వేళ అమ్మవారి పల్లకీ శోభాయాత్ర, శమీ దర్శనం అత్యంత వైభవంగా జరిగాయి.
Duvvuru: దువ్వూరులో ఘనంగా వాసవి అమ్మవారి శమీ దర్శనం
దువ్వూరు: దువ్వూరు లోని శ్రీ మరకత వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు విజయదశమి పర్వదినాన అత్యంత వైభవంగా ముగిశాయి. దసరా ముగింపు వేడుకల్లో భాగంగా జగన్మాత శ్రీ మరకత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శమీ (జమ్మి) దర్శన మహోత్సవాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
విజయదశమి అవతారం లో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పంచామృతాభిషేకాలు, విశేష అర్చనలు, అలంకరణలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సర్వాలంకార భూషితురాలైన అమ్మవారి ఉత్సవమూర్తిని ప్రత్యేక పల్లకీలో కొలువుదీర్చి శమీ దర్శనం నిమిత్తం శోభాయాత్రగా తరలించారు.
మంగళవాయిద్యాలు, మహిళల కోలాటాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయధ్వానాల నడుమ పురవీధుల్లో శోభాయాత్ర సాగింది. దారిపొడవునా భక్తులు అమ్మవారికి నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
శమీ వృక్షం వద్దకు చేరుకున్న అనంతరం వేదపండితులు శాస్త్రోక్తంగా అపరాజితా దేవి పూజ, శమీ పూజ, ఆయుధ పూజలను నిర్వహించారు. దుష్టశిక్షణ, శిష్టరక్షణకు ప్రతీక అయిన విజయదశమి రోజున శమీ దర్శనం చేసుకోవడం వల్ల సమస్త పాపాలు, గ్రహదోషాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని పండితులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
పూజా కార్యక్రమాల అనంతరం భక్తులు ఒకరికొకరు జమ్మి ఆకులను పంచుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, ప్రముఖ వ్యాపారవేత్తలు, ఆర్యవైశ్య ప్రముఖులు, పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.




