Rayachoti: వాటర్ గ్రిడ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్!
Rayachoti: వాటర్ గ్రిడ్ పనులను వేగవంతం చేసి 2027 జూన్ నాటికి అన్ని గ్రామాలకు ఇంటింటికీ తాగునీరు అందించాలని అన్నమయ్య కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం ఆదేశించారు.
Rayachoti: వాటర్ గ్రిడ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి: కలెక్టర్!
అన్నమయ్య జిల్లా: రాయచోటి నియోజకవర్గం లోని వెలిగల్లు రిజర్వాయర్ ద్వారా సురక్షితమైన తాగునీటిని అందించేందుకు చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
బుధవారం వెలిగల్లు రిజర్వాయర్ వద్ద కొనసాగుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను, కాఫర్ డ్యామ్ నిర్మాణ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన అదనపు సిబ్బందిని, యంత్రసామగ్రిని సమకూర్చుకుని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పాటు కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు.
ఈ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే మండలాల గ్రామీణ ప్రాంతాలకు వెలిగల్లు రిజర్వాయర్‌ను ప్రధాన నీటి వనరుగా వినియోగించి తాగునీటిని సరఫరా చేసేందుకు ఈ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టినట్లు తెలిపారు. ఈ సెగ్మెంట్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి, 2027 జూన్ నాటికి గ్రామీణ ప్రాంతాలన్నింటికీ ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీటి సరఫరాను తప్పనిసరిగా ప్రారంభించాలని స్పష్టం చేశారు.
అనంతరం గాలివీడులో ఏర్పాటు చేసిన ఎం.ఎస్ (MS) పైపుల తయారీ యార్డును జిల్లా కలెక్టర్ సందర్శించారు. పైపుల తయారీ, సరఫరా ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పైప్‌లైన్ నిర్మాణ పనులను కూడా సమాంతరంగా వేగవంతం చేసి, అవసరమైన పైపులను సకాలంలో అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించిన రిజర్వాయర్ పనులు, పైపుల తయారీ, పైప్‌లైన్ నిర్మాణం, ఇతర అనుబంధ పనులన్నింటినీ సమన్వయంతో చేపట్టాలని అధికారులకు సూచించారు. పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన ప్రతి గ్రామానికి ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు అందించడమే లక్ష్యంగా అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీ సమష్టిగా పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఈఓ కే. శ్రీధర్, గాలివీడు ఆర్డబ్ల్యూఎస్ సెక్షన్ అధికారి కృష్ణయ్య, RWS&S సెక్షన్, , గాలివీడు తహసీల్దార్ భాగ్యలక్ష్మి, RVR ఏజెన్సీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ విజయ సింహారెడ్డి, వారి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




