Duvvuru: చింతకుంట పీహెచ్‌సీలో పీఎంఎస్‌ఎంఏ కింద 32 మందికి పరీక్షలు!

Duvvuru: దువ్వూరు మండలం చింతకుంట పీహెచ్‌సీలో పీఎంఎస్‌ఎంఏ కింద 32 మంది గర్భిణులకు డాక్టర్ వికసిత పరీక్షలు నిర్వహించి 15 మందిని హై-రిస్క్ కేసులుగా గుర్తించారు.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 10 Nov 2026 6:35 PM IST
Duvvuru
X

Duvvuru: చింతకుంట పీహెచ్‌సీలో పీఎంఎస్‌ఎంఏ కింద 32 మందికి పరీక్షలు!

దువ్వూరు: స్థానిక చింతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు వైద్యాధికారి డాక్టర్ వికసిత ఆధ్వర్యంలో ‘ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. "సురక్షితమైన ప్రసవం – ప్రతి తల్లికి భద్రత, ప్రతి శిశువుకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు" అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో సుమారు 32 మందికి పైగా గర్భిణీ స్త్రీలకు ఉచితంగా వైద్య పరీక్షలు మరియు అల్ట్రాసౌండ్ స్కానింగ్ సేవలను అందించారు.

ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ వికసిత మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీ మహిళల ఆరోగ్య సంరక్షణకు ఈ పథకం ఒక వరం లాంటిదని కొనియాడారు. గర్భం దాల్చిన రెండవ లేదా మూడవ త్రైమాసికంలో ఉన్న మహిళలకు ప్రతి నెలా 9వ తేదీన పీహెచ్‌సీ వేదికగా ఉచిత సేవలు అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. గైనకాలజిస్టులు, నిపుణులైన వైద్యాధికారుల చేత ఉచిత తనిఖీలతో పాటు.. రక్తహీనత , హెచ్‌ఐవీ, మధుమేహం, రక్తపోటు, మరియు మూత్ర పరీక్షలు వంటి ల్యాబ్ పరీక్షలను పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అవసరమైన గర్భిణులందరికీ ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం మాత్రలను ఉచితంగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు.

ఈ శిబిరంలో పరీక్షలు నిర్వహించిన వారిలో 15 మందిని ప్రమాదకర స్థితిలో ఉన్నగర్భిణులుగా గుర్తించినట్లు డాక్టర్ వికసిత వెల్లడించారు. సాధారణ తనిఖీలతో పాటు ఇలాంటి హై-రిస్క్ ప్రెగ్నెన్సీ కలిగిన మహిళలను ప్రత్యేకంగా ట్రాక్ చేసే వ్యవస్థను బలోపేతం చేశామని, వీరు సురక్షితంగా డెలివరీ అయ్యేంత వరకు ఆశా కార్యకర్తల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు.

శిబిరంలో రక్తహీనతతో బాధపడుతున్న మహిళలను గుర్తించి, వారు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేసే పోషకాహారాన్ని (కోడిగుడ్లు, పాలు, రాగిజావ మరియు ఆకుకూరలు) తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యాధికారులు అవగాహన కల్పించారు. అలాగే ప్రసవ ప్రణాళిక, అత్యవసర సమయాల్లో 102, 108 ఉచిత వాహనాల వినియోగం మరియు ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు చేయించుకోవాల్సిన ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ పథకం మరియు అనుబంధ ప్రభుత్వ పథకాల సమన్వయం వల్ల దేశంలో మాతృ మరణాల రేటు గణనీయంగా తగ్గుముఖం పట్టిందని డాక్టర్ వికసిత ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఈ వైద్య శిబిరంలో ఆరోగ్య విస్తరణ అధికారి రాజగోపాల్, ఆరోగ్య పర్యవేక్షకులు శివ గంగరాజు, రాజేశ్వరమ్మ, సిహెచ్ఓలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR