Badvel: దీపావళి బాణసంచా విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరి ఆర్డీవో!

Badvel: దీపావళి బాణసంచా విక్రయాల్లో భద్రతా నిబంధనలు తప్పనిసరి అని బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ ఆదేశం. 81 మంది లైసెన్సుదారులు, అధికారులతో సమీక్ష సమావేశం.

B. ARUN KUMAR, BADVEL
Published on: 26 Oct 2026 11:00 PM IST
Badvel
X

Badvel: దీపావళి బాణసంచా విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరి ఆర్డీవో!

బద్వేల్: దీపావళి పండుగను ప్రమాదరహితంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ ఎ. చంద్ర‌మోహన్ సూచించారు. సోమవారం బద్వేల్ ఆర్డీవో కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో పాటు, ఈ ఏడాది బాణసంచా విక్రయాల కోసం లైసెన్సుల కొరకు అప్లై చేసిన 81 మంది లైసెన్సుదారులు, కమర్షియల్ ట్యాక్స్ శాఖ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, బాణసంచా విక్రయాలు అనుమతించిన ప్రదేశాల్లోనే నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు, విక్రయాలు చేపడితే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో శాఖల వారీగా కేటాయించిన బాధ్యతలు, సూచనలు ఇవి:

-రెవెన్యూ శాఖ: బాణసంచా విక్రయ కేంద్రాలు, గోడౌన్లను పోలీసు, అగ్నిమాపక శాఖలతో కలిసి తనిఖీ చేయాలి. లైసెన్సులు, నిల్వల పరిమితులు, భద్రతా నిబంధనల అమలును పర్యవేక్షించాలి.

- పోలీసు శాఖ: తాత్కాలిక విక్రయ కేంద్రాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రజల రద్దీని నియంత్రించాలి. అక్రమ తయారీ, నిల్వలు, విక్రయాలు, అనధికార రవాణాను అరికట్టాలి.

- అగ్నిమాపక శాఖ: విక్రయ కేంద్రాల వద్ద అగ్నిమాపక పరికరాలు, నీటి డ్రమ్ములు, ఇసుక బకెట్లు అందుబాటులో ఉండేలా చూడాలి. అవసరమైన చోట అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచి, సిబ్బందిని అప్రమత్తం చేయాలి.

- మున్సిపల్ శాఖ: దుకాణాల మధ్య తగినంత దూరం, బారికేడ్లు, పార్కింగ్ సదుపాయాలు కల్పించాలి. అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలి.

- విద్యుత్ శాఖ: తాత్కాలిక దుకాణాల్లో విద్యుత్ వైరింగ్, కనెక్షన్లను తనిఖీ చేసి, షార్ట్‌సర్క్యూట్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి.

- వైద్య ఆరోగ్య శాఖ: తగిన మందులతో వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలి. అవసరమైన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, 108, 104 అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉండేలా చూడాలి.

- రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులు: ప్రయాణికుల బస్సులు, ఆటోలు, ఇతర వాహనాల్లో బాణసంచా అక్రమ రవాణా జరగకుండా నిఘా ఉంచాలి. బస్సుల్లో బాణసంచా తీసుకెళ్లకుండా చర్యలు చేపట్టాలి.

- జిల్లా ప్రజా సంబంధాల శాఖ: బాణసంచా వినియోగంలో పాటించాల్సిన జాగ్రత్తలపై తెలుగు భాషలో ప్రింట్ మీడియా, కేబుల్ టీవీ, స్థానిక ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి.

- కమర్షియల్ ట్యాక్స్ శాఖ: సంబంధిత నిబంధనల మేరకు బాణసంచా వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షించి, తమ పరిధిలో అవసరమైన చర్యలు చేపట్టాలి.

- లైసెన్సుదారులు: లైసెన్సులో పేర్కొన్న ప్రదేశాల్లోనే విక్రయాలు నిర్వహించాలి. అనుమతించిన పరిమితులకు మించి బాణసంచా నిల్వ చేయకూడదు. అగ్నిమాపక పరికరాలు, నీటి డ్రమ్ములు, ఇసుక బకెట్లు సిద్ధంగా ఉంచి, అన్ని భద్రతా నిబంధనలను పాటించాలి.

ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, నిబంధనల ఉల్లంఘనలను గుర్తిస్తే తక్షణ చర్యలు తీసుకోవాలని ఆర్డీవో స్పష్టం చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, దీపావళి పండుగను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రతి శాఖ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.

B. ARUN KUMAR, BADVEL

B. ARUN KUMAR, BADVEL