Badvel: బద్వేల్లో తీవ్ర ఉద్రిక్తత: ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అరెస్ట్!
Badvel: బద్వేల్ మున్సిపల్ నామినేషన్ల వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఆదిత్య రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేసి పోరుమామిళ్లకు తరలించారు.
Badvel: బద్వేల్లో తీవ్ర ఉద్రిక్తత: ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అరెస్ట్!
బద్వేల్: ఈరోజు బద్వేల్లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించి, బద్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ శ్రీ డి.సి. గోవిందరెడ్డి గారు, నియోజకవర్గ యువ నాయకుడు, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గారు, బూత్ కన్వీనర్ల సమన్వయకర్త కల్లూరి రమణారెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సాయి కృష్ణ గారితో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోరుమామిళ్లకు తరలించారు.
నాయకులను తరలించే క్రమంలో పార్టీ శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని చెదరగొట్టి ముందుకు సాగారు. బద్వేల్లో గత 25 సంవత్సరాలుగా ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న రాజకీయ పరిస్థితులను ప్రస్తుత పరిణామాలు దెబ్బతీస్తున్నాయని పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
నిన్న బద్వేల్ మున్సిపల్ కార్యాలయంలోకి టీడీపీ ఇన్చార్జి సూర్యనారాయణ రెడ్డి గారు వెళ్లి, అక్కడి అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్ పత్రాలను బలవంతంగా బయటకు తీసుకెళ్లి చించివేసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు.
నామినేషన్లు దాఖలు చేసినట్లు తమ వద్ద రసీదులు, ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల్లో ప్రజల తీర్పును ఎదుర్కొనే బదులు, నామినేషన్ ప్రక్రియకు అడ్డంకులు సృష్టించడం, అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ యువ నాయకుడు దేవసాని ఆదిత్య రెడ్డి గారు మాట్లాడుతూ.. బద్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే ధైర్యం లేకనే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పార్టీ నాయకులను, కార్యకర్తలను, కౌన్సిలర్ అభ్యర్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన ఈరోజు మరో 20 నామినేషన్లు వేయాల్సి ఉండగా, పార్టీ ముఖ్య నాయకులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి, బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి సూర్యనారాయణ రెడ్డి గారికి నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే బద్వేల్ మున్సిపల్ ఎన్నికలను ఎలాంటి అడ్డంకులు లేకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సవాల్ విసిరారు.
తాము నామినేషన్లు దాఖలు చేసినట్లు రసీదులు, ఆధారాలు ఉన్నాయని, తమకు జరిగిన అన్యాయంపై హైకోర్టును ఆశ్రయించి న్యాయం పొందుతామని ఆదిత్య రెడ్డి గారు స్పష్టం చేశారు. న్యాయపోరాటం ద్వారా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని సాధించుకొని, బద్వేల్ ప్రజల ఆదరణతో తమ బలాన్ని నిరూపించుకుంటామని భరోసా ఇచ్చారు.
పోలీసులను అడ్డం పెట్టుకొని బెదిరింపులకు పాల్పడినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెనక్కి తగ్గబోరని, ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగితే ప్రజలే తమ తీర్పును వెల్లడిస్తారని తెలిపారు.ఎమ్మెల్సీ శ్రీ డి.సి. గోవిందరెడ్డి గారు మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు, ముఖ్యంగా సూర్యనారాయణ రెడ్డి గారి వ్యవహారశైలి కారణంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ ప్రక్రియకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఆరోపించారు.
ఈరోజు ఉదయం తాను బద్వేల్లోని పార్టీ కార్యాలయంలో ఉండగా, మరో 20 నామినేషన్లు దాఖలు చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమవుతున్న సమయంలో పోలీసులు కార్యాలయం వద్దకు వచ్చి తనతో పాటు ఆదిత్య రెడ్డి గారిని, కల్లూరి రమణారెడ్డి గారిని, ఇతర నాయకులను అరెస్టు చేసి పోరుమామిళ్లకు తరలించారని తెలిపారు.
నామినేషన్ల ప్రక్రియ చివరి రోజున పార్టీ నాయకులను నిర్బంధించడం వల్ల అభ్యర్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం ప్రస్తుత పరిస్థితుల్లో కలగడం లేదని, ఈ విషయాన్ని సంబంధిత ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు.
ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ తగిన స్పందన లభించడం లేదని పేర్కొన్నారు.మరోవైపు, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు, ఆదిత్య రెడ్డి గారు, కల్లూరి రమణారెడ్డి గార్లను పోరుమామిళ్లకు తరలిస్తున్న సమయంలో అక్కడి ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చేరుకొని అరెస్టులను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బద్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి అభ్యర్థికి నామినేషన్ దాఖలు చేసే హక్కు కల్పించాలని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు.
చంద్రబాబు నాయుడు గారికి, సూర్యనారాయణ రెడ్డి గారికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సవాల్:బద్వేల్ మున్సిపల్ ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించండి. అభ్యర్థుల నామినేషన్లకు అడ్డంకులు లేకుండా చూడండి. అరెస్టులు, నిర్బంధాల ద్వారా ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవద్దు. ప్రజలు ఎవరిని గెలిపించాలో వారే నిర్ణయించుకునే అవకాశం కల్పించండి. దమ్ము, ధైర్యం ఉంటే ప్రజల తీర్పును గౌరవిస్తూ ఎన్నికలను సజావుగా జరిపించండి.




