Duvvuru: తిరుపతిలో 25న ఏపీఎస్పీడీసీఎల్ డిస్కం మహాసభలు!
Duvvuru: ఈ నెల 25న తిరుపతిలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 8వ డిస్కం మహాసభలు. జూనియర్ లైన్మెన్ ప్రమోషన్లు, జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్.
Duvvuru: తిరుపతిలో 25న ఏపీఎస్పీడీసీఎల్ డిస్కం మహాసభలు!
Duvvuru: తిరుపతి యశోద నగర్లోని సీఐటీయూ కార్యాలయంలో ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 8వ ఏపీఎస్పీడీసీఎల్ డిస్కం మహాసభలను విజయవంతం చేయాలని యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు.
గురువారం ఉదయం స్థానిక సీవీవీ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నాయబ్ రసూల్, వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షులు బి.ఎన్. నాగసుబ్బయ్య మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ మహాసభలు జరగనున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూనియర్ లైన్మెన్ గ్రేడ్-2 ఉద్యోగులకు సీనియార్టీ జాబితాను విడుదల చేసి పదోన్నతులు కల్పించాలని, 2004 ఆగస్టు 31 లోపు చేరిన ఉద్యోగులకు ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్ సౌకర్యం వర్తింపజేయాలని కోరారు. ఈపీఎఫ్ ఉద్యోగులకు హయ్యర్ పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని, టాటా ఏఐజీ మెడికల్ ఇన్సూరెన్స్లో ఉన్న లోపాలను సవరించి సంపూర్ణ వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.
జీవో నెం. 45 ప్రకారం పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచాలని, అర్హులైన సిబ్బందికి జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ ఇంజనీర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. అలాగే సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాలని, సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలను తక్షణమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి నేరుగా సంస్థలోనే విలీనం చేయాలని, ప్రతి ఉద్యోగికి నూతన పీఆర్సీని అమలు చేయాలని స్పష్టం చేశారు.
ఈ ప్రధాన డిమాండ్లపై మహాసభల్లో విస్తృతంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. కావున విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ మహాసభలను జయప్రదం చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.




