Rayachoti: నామినేషన్లు అడ్డుకుంటే వెంటనే ఫిర్యాదు చేయండి: కలెక్టర్!
Rayachoti: అన్నమయ్య జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటే తక్షణమే ఫిర్యాదు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పష్టం చేశారు.
Rayachoti: నామినేషన్లు అడ్డుకుంటే వెంటనే ఫిర్యాదు చేయండి: కలెక్టర్!
రాయచోటి: అన్నమయ్య జిల్లాలో రెండో సాధారణ ఎంపీటీసీ (MPTC), జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి, నామినేషన్లు దాఖలు చేయకుండా ఎవరైనా తమను అడ్డుకున్నట్లు భావించే వ్యక్తులు, తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు..., నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నట్లు ఎవరైనా ఫిర్యాదు చేసినట్లయితే, సంబంధిత అధికారులు ఆ ఫిర్యాదులను పరిశీలించి, ఫిర్యాదుదారులను వెంటనే ఫోన్ ద్వారా సంప్రదించి, నిర్దేశిత గడువు సాయంత్రం 5.00 గంటలలోపు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన సహకారం అందించాల్సి ఉంటుందని తెలిపారు.
సంబంధిత రిటర్నింగ్ అధికారులు నిర్దేశిత ఎన్నికల నిబంధనలు, విధివిధానాలకు అనుగుణంగా అటువంటి అభ్యర్థులు సమర్పించే నామినేషన్లను స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు పేర్కొన్నారు.
అవసరమైన చోట సంబంధిత పోలీసు అధికారులు ఫిర్యాదుదారులకు వ్యక్తిగత భద్రత కల్పించి, నామినేషన్ల స్వీకరణ కేంద్రాలకు వారిని తీసుకెళ్లి, ప్రశాంతంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.
నామినేషన్లు దాఖలు చేయకుండా నిజంగా అడ్డంకులు ఎదుర్కొన్నవారు మాత్రమే తమ ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంలో జిల్లా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.




